తేలని ఢిల్లీ కాంటాక్ట్‌ లెక్క.. ఇంకా 120 మంది..

ABN , First Publish Date - 2020-04-08T22:43:55+05:30 IST

క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీరందరికీ చికిత్స చేస్తే కరోనా సమస్య పరిష్కారమైనట్లనుకుటే పొరపాటే. కరోనా కేసులకు ఇది ఒక ముఖం మాత్రమే. ఈ లింక్‌ ఇంకా పూర్తి కాలేదు.

తేలని ఢిల్లీ కాంటాక్ట్‌ లెక్క.. ఇంకా 120 మంది..

గుర్తించలేకపోతున్న అధికారులు

30 మంది వైద్యులకు కూడా పరీక్షలు

అదనంగా మరో 50 కేసులు 

రిపోర్టుల కోసం ఎదురుచూపు


కర్నూలు (ఆంధ్రజ్యోతి): క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీరందరికీ చికిత్స చేస్తే కరోనా సమస్య పరిష్కారమైనట్లనుకుటే పొరపాటే. కరోనా కేసులకు ఇది ఒక ముఖం మాత్రమే. ఈ లింక్‌ ఇంకా పూర్తి కాలేదు. ఈ అధికారిక లెక్కలకు అవతల మరో సత్యం కూడా ఉన్నది. సుమారుగా మరో 120కి పైగా కరోనా కేసులు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఢిల్లీ కాంటాక్ట్‌లోనివే. వీరిని గుర్తించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. వీరి కోసం జిల్లా అంతా జల్లెడ పడుతున్నారు. నంద్యాలలో దొరకని 40 కేసులతో పాటు కర్నూలు, బనగానపల్లె, ఆదోని తదితర ప్రాంతాల్లో ఇంకా పదుల సంఖ్యలో ఢిల్లీ కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయి. ఇవన్నీ మిస్సింగ్‌ కింద నమోదయ్యాయి. వీరిని ఆరా తీయడానికి మత పెద్దలు కొందరు సహకరించలేదనే అభిప్రాయం ఉంది. ఇక ప్రజలే తమ పరిసరాల్లో కరోనా సోకిన అనుమానితులను గుర్తిస్తే అధికారులకు సహకరించాల్సిందే.


ఢిల్లీలో జరిగిన ఓ మత సమావేశానికి వెళ్లిన జిల్లా వాసులు మార్చి 19, 20 తేదీల్లో రైళ్లలో, విమానాల్లో తిరిగి వచ్చేశారు. అలాంటివారిని 357 మందిని గుర్తించామని, 338 మందికి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఇటీవల  తెలిపారు. ఇక అలాంటి కేసులు జిల్లాలో లేవని స్పష్టం చేయలేదు. నంద్యాల నుంచి 120 మంది వెళ్లి వచ్చారనే సమాచారం ఉంది. వారిలో 70 మంది మాత్రమే అందుబాటులోకి వచ్చారు. మిగిలిన 40 మంది గురించి అధికారులకు తెలియదు. కర్నూలు పట్టణంలో 175 మంది ఢిల్లీ వెళ్లి వచ్చారని గుర్తించారు. వీరిలో 58 మంది ఇంకా లెక్క తేలలేదు. ఎమ్మిగనూరులో 20 మంది అందుబాటులోకి రాలేదు. ఆదోనిలో ఐదారుగురి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో ఎక్కడిక్కడ స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. 


దారి మధ్యలో అడ్డంకులు

ఇలా లెక్క తేలని వారిలో కొందరు ఢిల్లీ తిరుగు ప్రయాణంలో చిక్కుకపోయారనే సమాచారం ఉంది. నంద్యాలకు చెందిన 8 మంది మహారాష్ట్రలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. వారికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఇలా అనేక కారణాల వల్ల ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి లెక్కలు తేలడం లేదు. అలాగే ఆదోనికి చెందిన 13 మంది వలస కార్మికులు రెండ్రోజుల క్రితమే జిల్లాకు తిరిగి వచ్చారు. వీరిని కుటుంబసభ్యులే ఇండ్లలోకి రానివ్వలేదు. వీరి వివరాలు స్థానికులు అధికారులకు తెలియజేశారు. అధికారులు వారిని కర్నూలు క్వారంటైన్‌కు తొలుత తరలించారు. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నందు వల్ల తిరిగి ఆదోని క్వారంటైన్‌కు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో వైరస్‌ సోకిన వారందరి లిస్టు ఇంకా పూర్తి కాలేదు. మొదట ఢిల్లీ కాంటాక్ట్‌ లిస్టింగ్‌ వ్యక్తులు 120 మందిని గుర్తించి క్వారంటైన్లకు తరలించకుంటే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యం కాదు. ఇప్పుడున్న 74 పాజిటివ్‌ కేసులు ఎంతకైనా పెరిగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. 


రెండ్రోజుల్లో 80 మందికి పరీక్షలు 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సుమారు 80 మందికి పైగా కరోనా పరీక్షలను వైద్యులు చేపట్టారు. ఈనెల 3వ తేదీ పాణ్యంకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్య సమ స్యతో ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు. ఆయనకు కరోనా వైరస్‌ కూడా సోకిందనే అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయించారు. అందులో పాజిటివ్‌ అని 5వ తేదీ రిపోర్టు వచ్చింది. దీంతో అతనికి వైద్యం చేసిన 30 మందికి సోమవారం  కరోనా పరీక్షలు చేయించారు. వీటితోపాటు మరో 50 అటాచ్‌మెంట్‌ కేసులకు మంగళవారం ఉదయం రిపోర్టు కోసం పంపించారు. ఈ 80 మంది పరీక్షల రిపోర్టు తేలవలసి ఉంది. వీరికితోడు ఢిల్లీ కాంటాక్ట్‌లోని 120 మందిని గుర్తించి వారి పరిస్థితి ఏమిటో తేల్చవలసి ఉన్నది. అట్లా జిల్లాలో ఇప్పటికి 200 కేసులు ఉన్న ట్లు. ఇప్పటికే 74 పాజిటివ్‌ కేసులు జిల్లాలో ఉన్నాయి. ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్య ధికం. ఈ సంఖ్య ఆగుతుందా? ఇంకా పెరుగుతుందా? అనేది తేలవలసి ఉన్నది.

Updated Date - 2020-04-08T22:43:55+05:30 IST