మరో మూడు కేసులు
ABN , First Publish Date - 2020-04-05T09:50:55+05:30 IST
జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటి వరకు ప్రిజెంప్టివ్‌గా నమోదైన మూడు కేసులే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ వీరపాండియన్ శనివారం తెలిపారు.

నాలుగుకు చేరిన కరోనా పాజిటివ్ సంఖ్య
ఆ ముగ్గురూ ఢిల్లీ కాంటాక్ట్ లిస్టింగ్ వ్యక్తులే
449 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
ప్రస్తుతం 90 పరీక్షల్లో 87 మందికి నెగెటివ్
దిగ్బంధం తప్పదు.. ప్రజలు సహకరించాలి
కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్నటి వరకు ప్రిజెంప్టివ్‌గా నమోదైన మూడు కేసులే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ వీరపాండియన్ శనివారం తెలిపారు. సంజామల మండలంలో ఒక కేసుతో కలిపి కరోనా పాజిటివ్ సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, రాబోయే పాజిటివ్ కేసుల్లో 50ు పైగా కర్నూలు నగరం నుంచి, మరో 25ు నంద్యాల నుంచి రావచ్చని కలెక్టర్ ప్రకటించారు. దీంతో నగర వ్యాప్తంగా దిగ్బంధనం తప్పదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ప్రజల సహకారం ఉంటేనే కరోనాను నియంత్రించగలమని, లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఈ పరిస్థితులే అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కర్నూలులో తొలి కేసు
కర్నూల్లోని రోజా వీధిలో నివసిస్తున్న 58 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసుగా నిర్ధారణ అయింది. ఆయన ఢిల్లీలో జరిగిన ఓ మత సమావేశానికి మార్చి 12వ తేదీన వెళ్లి 18వ తేదీన తిరిగి కర్నూలుకు వచ్చారు. తొలుత బాగానే ఉన్నా వారం తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన స్థానిక వైద్యులతో పరీక్షలు చేయించుకున్నారు. అయినా తగ్గలేదు. ఈలోపే ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన విషయం తెలుసుకున్న అధికారులు కర్నూల్లోని రాయలసీమ యూనివర్శిటీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అదే రోజున శ్వాప్ పరీక్ష చేసి నమూనాలను అనంతపురం ల్యాబ్‌కు పంపగా ఒకటో తేదీన ప్రిజెంప్టివ్ పాజిటివ్ కేసుగా నివేదిక వచ్చింది. కర్నూలు కేసుతో పాటు బనగానపల్లె, అవుకు కేసులు 1వ తేదీన ప్రిజెంప్టివ్ పాజిటివ్ కేసుగా నమోదవ్వడంతో 2వ తేదీన ఆ ముగ్గురినీ నంద్యాల శాంతిరామ్ కోవిడ్ హాస్పిటల్‌కు వైద్య శాఖాధికారులు తరలించారు. అనంతరం మరోమారు నిర్ధారణ కోసం కర్నూల్లో గుర్తించిన కేసు నమూనాలను తిరుపతిలోని ల్యాబ్‌కు పంపించారు. పాజిటివ్‌గా నిర్ధారిస్తూ తిరుపతి నుంచి రిపోర్టు అందింది. దీంతో అజముద్దీన్ నగర్, రోజా వీధికి మూడు కిలోమీటర్ల మేర కోవిడ్-19 కంటోన్మెంట్ జోన్‌గా, 5 కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా కలెక్టర్ ప్రకటించారు. ఇన్‌ఫెక్షన్ రాకుండా సోడియం హైపో ద్రావణాలను పిచికారీ చేయిస్తున్నారు. అధికారులు నగరంలో ఢిల్లీ కాంటాక్ట్ లిస్టింగ్ కోసం మరింతగా జల్లెడ పడుతున్నారు.
బనగానపల్లెలో..
బనగానపల్లె పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీన్ని కలెక్టర్ అధికారికంగా శనివారం నిర్ధారించారు. దీంతో పట్టణంలో రహదారులను అధికారులు, పోలీసులు దిగ్బంధం చేశారు. బాధిత వ్యక్తి ఉండే ప్రాంతాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. బాధిత వ్యక్తితో సంబంధమున్న వారిని క్వారంటైన్‌కు తరలించారు. మార్చి 13వ తేదీన ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనలకు వెళ్లిన ఆయన అదే నెల 15న బనగానపల్లెకు వచ్చారు. జ్వరం, జలుబు, దగ్గుతో సతమతమవుతూ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన్ను కర్నూలు క్వారంటైన్ కేంద్రానికి 19న తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేయగా 13 రోజుల అనంతరం బుధవారం రాత్రి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన బనగానపల్లెకు వచ్చిన తర్వాత ఓ మసీదులో భోజనాలు కూడా పెట్టించారని సమాచారం రావడంతో పంచాయతీ ఈవో సతీష్‌కుమార్‌రెడ్డి మసీదును శుభ్రం చేసి సోడియం క్లోరైడ్ చల్లించారు. గురువారం బాధితుడి భార్యను కూడా క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అవుకులో..
ఢిల్లీలో మత ప్రార్థనలకు అవుకు నుంచి ఇద్దరు వ్యక్తులు మార్చి 13వ తేదీన వెళ్లి తిరిగి 19వతేదీన వచ్చారు. వైద్యసిబ్బంది ఇంటింటి సర్వేలో ఆ ఇద్దరిని గుర్తించి వైద్య ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరిని 28వ తేదీన బనగానపల్లె క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఓ వ్యక్తి దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతుండగా 29వతేదీన నంద్యాలలోని శాంతిరామ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆయనకు స్వాప్ తీసి అనంతపురం ల్యాబ్‌కు పంపగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కొద్ది రోజుల అనంతరం ఆ వ్యక్తిని వైద్యులు ఇంటికి పంపించారు. ఈలోపే ఆ రెండో వ్యక్తికి కరోనా లక్షణాలను వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు 31వతేదీన రక్తనమూనాలను సేకరించి అనంతపురం పంపించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అవుకులోకి ప్రవేశించే నాలుగు రహదారులను మూసివేశారు. ఇళ్లనుంచి ప్రజలు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
తప్పదు సహకరించండి: కలెక్టర్
కలెక్టర్ వీరపాండియన్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 848 మందిని గుర్తించగా 449 మందికి పరీక్షలు నిర్వహించి ల్యాబ్‌కు పంపించామన్నారు. ఇందులో 81 నమూనాల నివేదికలు వచ్చాయని, 4 పాజిటివ్ కేసులుగా నిర్ధారితమయ్యాయన్నారు. ఢిల్లీ కాంటాక్ట్ లిస్టింగ్ ద్వారా జిల్లాలో ప్రవేశించిన 357 మందిని గుర్తించామని, వారిలో 338 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. తిరుపతి, అనంతపురం ల్యాబ్‌లకు పంపగా 90 రిపోర్టులు వచ్చాయని, ఇందులు 87 నెగెటివ్ రిపోర్టు రాగా 3 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. తొలుత వైరస్ లక్షణాలున్న వ్యక్తులకే పరీక్షలు చేశామని, పరిస్థితి విషమిస్తుండటంతో అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నాలుగు కేసులే గాక జిల్లాలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని స్పష్టం చేశారు.
ముఖ్యంగా కర్నూలు నగరం నుంచి అత్యధికంగా కేసులు రావచ్చన్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాలను అలెర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదని, అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకుల్ని ఇళ్లకే పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రజల సహకారంతోనే కరోనాను అరికట్టవచ్చన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారికి కరోనా పరీక్షలు చేయించాలని మునిసిపల్ కమిషనర్లు, ఇన్సిడెంట్ కమాండర్స్, ఎంపీడీవోలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
కరోనా పాజిటివ్ ప్రాంతాలు.. కంటోన్మెంట్ జోన్లు
కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం కంటోన్మెంట్ జోన్లుగా, బఫర్ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. కర్నూలు రోజా వీధి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల కంటోన్మెంట్ జోన్‌గా, 5 కిలోమీటర్ల మేర బఫర్‌జోన్‌గా ప్రకటించామన్నారు. అవుకు, బనగానపల్లి పట్టణాల్లో కూడా ఇలానే చేశామని వివరించారు. క్వారంటైన్ నిబంధనలు పాటించని ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అనంతపురం, తిరుపతి ల్యాబ్‌ల నుంచి మరిన్ని రిపోర్టులు రావలసి ఉందన్నారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీవోకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కర్నూలు కరోనా కాల్ సెంటర్ నెంబర్ 9441300005కు లేదా 104కు కాల్ చేసి తెలపాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.