దొంగలు పడ్డారు..!

ABN , First Publish Date - 2020-03-02T11:01:10+05:30 IST

జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

దొంగలు పడ్డారు..!

తాళం వేస్తే చొరబాటు

క్షణాల్లో ఇళ్లు గుల్ల

పోలీసులకు సవాలు

పనితీరుపై విమర్శలు 


కర్నూలు, మార్చి 1: జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఊడ్చేస్తున్నారు. జిల్లాలో దొంగతనాలు చేస్తున్నది ప్రొఫెషనల్స్‌ కాదు. చిల్లర నేరస్తులే. అందరూ పొరుగు జిల్లాల వారే అని తెలుస్తోంది. జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన వారు వీరిలో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరిపై పోలీసుల నిఘా కొరవడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వరుస చోరీలు జరుగుతున్నాయి. అరగంట వ్యవధిలో పని కానిచ్చి మాయమైపోతున్నారు. మహిళలు ఇళ్లలో ఒంటరిగా ఉండాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 


పోలీసులు వైఫల్యమే..

జిల్లాలో వరుస దొంగతనాలకు ప్రధాన కారణం పోలీసుల వైఫల్యమే అన్న విమర్శ వస్తోంది. సారత్రిక ఎన్నికలు ముగిశాక ఇప్పటి వరకు జిల్లాలో 80 పైగా దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. ఈ పది నెలల కాలంలో పోస్టింగుల కోసం కొంతకాలం, ఆ తరువాత ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి కొంతకాలం వెచ్చించారని, దొంగలు, దొంగతనాలపై నిఘా గాలికి వదిలేశారని సామాన్యులు అంటున్నారు. దొంగతనాలు జరిగినప్పుడు హడావుడి చేసి, స్పెషల్‌ పార్టీ పేరిట గాలిస్తారు. ఆ తర్వాత చల్లబడుతున్నారు. సంఘటన ప్రదేశంలో ఫింగర్‌ ప్రింట్లు లభ్యమైనా, దొంగలు ఎవరో తెలిసినా పట్టుకోవడంలో వెనుకబడి పోతున్నారు. పట్టుబడిన వారి నుంచి రికవరీలు అంతంత మాత్రమే. 


నిరంతర తనిఖీలు ఉంటేనే..

నగర శివారుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిత్యం తనికీలు చేస్తే దొంగతనాలకు కొంత అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. నగరంలో సీసీ కెమెరాల వల్ల ఫలితాలు పెద్దగా రావడం లేదు. ఇవి కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దొంగతనాలు ఎక్కువగా శివారు కాలనీలో జరుగుతున్నాయి. సీసీ కెమెరాల్లో రాత్రి విజన్‌  స్పష్టంగా కనబడదు. దీంతో పాటు అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే ఆరోపణలున్నాయి. 


సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఏదీ..?

జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎన్నో సాంకేతిక యంత్రాలు సమకూరాయి. ఫిన్స్‌, ఫాల్కన్‌, వంటి యంత్ర పరికరాలు ఉన్నా వినియోగం మాత్రం అరకొరే. ఫిన్స్‌తో పాత నేరస్థులను పట్టుకునే అవకాశం ఉన్నా ఇటీవల కాలంలో ఈ పరికరంతో తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దొంగతనాల నివారణకు పోలీసు శాఖ ప్రవేశ పెట్టిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ ద్వారా దొంగతనాలు అరికట్టవచ్చని చెబుతున్నా, దీనిపట్ల ప్రజల్లో తగిన అవగాహన లేదు. ఒక స్టేషన్‌ పరిధిలో దొంగతనం జరిగితే మరో స్టేషన్‌ను అప్రమత్తం చేయడం లేదని, సమన్వయం కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రధాన రహదారులపై మాత్రమే తనిఖీలు ఉంటున్నాయి. క్యూఆర్‌టీ, రక్షక్‌ బైక్‌లు శివారు కాలనీ, సందుల్లో తిరిగితే దొంగతనాలు కొంత తగ్గే అవకాశం ఉంది. 


వాహన తనిఖీ

వాహనాల తనిఖీ తూతూ మంత్రంగా సాగుతోంది. ‘ఆర్సీ, లైసెన్స్‌ ఉందా, హెల్మెట్‌ ఉందా, జరిమానా కట్టు..’ అనే మాటలకే పరిమితమౌతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కొందరికి కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడచిన మూడు నెలల్లో రికవరీలు, పాత నేరస్థుల అరెస్టు వంటి చర్యలు లేవు. కొన్ని స్టేషన్లలో దొంగతనం జరిగినా కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు. యాదృచ్చికంగా దొంగలు దొరికినప్పుడు పాత కేసులు తిరగేసి, పోయిన సొమ్ము రికవరీ చేస్తున్నారు. అప్పటికప్పుడు కేసులు నమోదు చేసి అధికారుల మెప్పుకోసం రికవరీలు చూపిస్తున్నారు. 


 రెండు నెలల్లో 6 చోరీలు

నంద్యాల (నూనెపల్లె): నంద్యాల పట్టణంలో గత రెండు నెలల్లో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 6 చోరీలు జరిగాయి. 4 చోట్ల విఫలయత్నం చేశారు. 


ఫిబ్రవరి 5న అర్ధరాత్రి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫరూక్‌ నగర్‌లో ఉన్న సఫా మెడికల్‌ స్టోర్‌లో చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమోరాలను ధ్వంసం చేసి, షట్టర్‌కు ఉన్న తాళాలను తొలగించి కౌంటర్‌లో ఉన్న రూ.60 వేలు అపహరించారు.


ఫిబ్రవరి 17న త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నూనెపల్లెలో ఉన్న అశోక్‌ నగర్‌ కాలనీలో దొంగలు ఏకంగా 4 ఇళ్ళల్లో చోరీకి పాల్పడ్డారు. 3 ఇళ్ళల్లో ఏలాంటి సొత్తు దొరకకపోవడంతో అదే కాలనీకి చెందిన ఆళ్ళగడ్డ డిపో ఆర్టీసీ కండెక్టర్‌ సుబ్బారావు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. తన కూతురు పెళ్ళి పనుల నిమిత్తం ప్రొద్దుటూరుకు వెళ్ళిన సుబ్బారావు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుళ్ల అయింది. కూతురు పెళ్ళి కోసం దాచిన 30 తులాల బంగారం, అర కేజీ వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు.


ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు తాలుకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని క్రాంతినగర్‌లో ఇద్దరు దొంగలు ఓ ఇంటిని టార్గెట్‌ చేసి చోరీకి పాల్పడుతుండగా స్థానికులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.



ఏడు చోట్ల చోరీలు

ఆళ్లగడ్డ: నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, చాగలమర్రి పట్టణాల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఏడు చోట్ల దొంగలు పడ్డారు. రూ.4.50 లక్షలు ఎత్తుకెళ్లారు. ఆళ్లగడ్డలోని నంద్యాల రోడ్డులో జనవరి 3న ఆటో మొబైల్‌ షాపుల్లో  దొంగతనం జరిగింది. రూ.3.50 లక్షలు ఎత్తుకెళ్లారు. ఫిబ్రవరి 7న నిందితున్ని అరెస్టు చేసి నగదు రికవరీ చేశారు. చాగలమర్రిలోని నాలుగు ఇళ్లలో పట్టపగలు దొంగలు చొరబడ్డారు. ఫిబ్రవరి 22న  రూ.లక్ష  ఎత్తుకెళ్లారు. 


డోన్‌ పట్టణంలో..

డోన్‌ రైల్వే గేట్ల సమీపంలోని తాహెచ్‌ బాషా జ్యూవెలరీ షాప్‌లో జనవరి 19న జరిగిన దొంగలు పడ్డారు. 200 గ్రాముల వెండి, 5 గ్రాముల బంగారం ఎత్తుకుపోయారు.


శ్రీనివాసనగర్‌లో ఈ నెల 26న  రెండు ఇళ్లలో చోరీ జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రూ.50 వేలు, మూడు తులాల బంగారం, అదే వీధిలోని సులోచన ఇంట్లో రూ.30 వేలు, మూడు తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆదే ప్రాంతంలో బాషా, నూర్‌ ఆహమ్మద్‌కు చెందిన రెండు బైక్‌లు ఎత్తుకుపోయారు. 

 

రెండు నెలల్లో ఆరుచోట్ల

ఎమ్మిగనూరు: మంత్రాలయం, ఎమ్మిగనూరు నియెజకవర్గాల్లో గడచిన రెండు నెలల్లో ఆరు చోట్ల చోరీలు జరిగాయి. రూ.లక్షల నగదు, బంగారు ఆభరణాలను మాయం చేశారు. పెద్దకడుబూరు మండలం బసలదొడ్దిలో ఓకే రాత్రి ఆరు ఇళ్లలో చొరబడ్డారు. ఎమ్మిగనూరులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పట్టపగలు చొరబడి నగదు, బంగారం ఎత్తుకుపోయారు. 


ఎమ్మిగనూరులోని లక్ష్మణ్‌ టాకీస్‌ సమీపంలో చిన్న కొండయ్య ఇంట్లో 27వ తేదీ రాత్రి దొంగలు పడి ఏడుతులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేలు చోరీ చేశారు. 


ఎమ్మిగనూరు ఎస్‌ఎంటీ కాలనీలో ట్రెజరీ ఉద్యోగి ఖాదర్‌ బాషా ఇంట్లో ఫిబ్రవరి 12న పట్ట పగలు ఇంట్లో బిరువాను పగలగొట్టి రూ.50 వేలు, బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. 


ఎమ్మిగనూరు హెచ్‌బీఎస్‌ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి శ్రీదేవి విఽధుల నిమిత్తం శ్రీశైలం వెళ్లారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి రూ.70 వేలు, బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. 


నందవరం మండలం గురుజాలలో జనవరి 6న వెంకటేశ్వర్లు అనే రైతు ఇంట్లో పట్టపగలు చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి రెండు తులాల బంగారం, రూ.1.20 లక్షల నగదు చోరీ చేశారు.


పెద్దకడుబూరు మండలం బసలదొడ్దిలో జనవరి 16 అర్ధరాత్రి ఆరు ఇళ్లలో చొరబడ్డారు. రూ.2 లక్షలు, ఆరు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. 


పెద్దకడుబూరు మండలం నాగలాపురంలో ఫిబ్రవరి మొదటి వారంలో భాస్కర్‌ ఇంట్లో రూ.35 వేలు, తులం బంగారం ఎత్తుకుపోయారు. 


అప్పుచేసి పెళ్లిచేస్తున్నా..  హనుమంతు, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం

కొడుకు పెళ్లికోసం గుంటూరుకు వలస వెల్లి కూలి పనులు చేసి రూ.1.20 లక్షలు పోగు చేశాము. దాంతోపాటు తులం బంగారాన్ని జనవరిలో దొంగలు ఎత్తుకుపోయారు. తప్పని పరస్థితుల్లో పెళ్లికి రూ.2 లక్షలు అప్పు చేశాము. తీర్చేందుకు మరోసారి కుటుంబమంతా వలస వెళ్లాల్సిందే. 

 

Updated Date - 2020-03-02T11:01:10+05:30 IST