ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిపై రాజకీయ పడగ.. నాయకుల స్వార్థానికి బలవుతున్న క్షేత్రం

ABN , First Publish Date - 2020-12-11T05:51:04+05:30 IST

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నడిబొడ్డున ఉంది.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిపై రాజకీయ పడగ.. నాయకుల స్వార్థానికి బలవుతున్న క్షేత్రం
పత్తిపై విస్తృత పరిశోధనలు చేస్తున్న భూమి ఇదే

ఇవి సాధారణ భూములా? 

నిర్వీర్యం దిశగా ప్రభుత్వం అడుగులు

ఎఫ్‌టీసీలోకి 5.78 ఎకరాల బదలాయింపు

ఆ జీవోలో కనిపించని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రస్తావన

ప్రపంచ ప్రఖ్యాత విత్తనాల ఆవిష్కరణ ఇక్కడే


నంద్యాల, డిసెంబరు 10: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఎకరా రూ.10 కోట్లకు పైమాటే. వైద్య కళాశాల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమి విలువ రూ.500 కోట్లకు పైగా ఉంటుంది. వైద్య కళాశాలకు పట్టణ శివారుల్లో ప్రభుత్వ భూముల నుంచి కేటాయించొచ్చు. కానీ అటువైపు ఆలోచించలేదు. అత్యంత విలువైన పరిశోధన స్థానం భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. దీనిపై ఆంధ్రజ్యోతి ఇప్పటికే కథనాలను ప్రచురించింది. అత్యంత విలువైన పరిశోధన స్థానం భూమిని సాధారణ నేలగా చూపించారు. తాము అనుకున్నట్లుగానే భూ బదలాయింపు తతంగాన్ని పూర్తి చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిధిలో ఉన్న భూమిని కూడా పక్కనే ఉన్న రైతు శిక్షణ కేంద్రం పరిధిలోకి చేర్చారు. పరిశోధన భూమి ప్రాధాన్యాన్ని తగ్గించి చూపించడం విమర్శలకు తావిస్తోంది.


 234-సీ1 సర్వే నెంబరులోని 5.78 ఎకరాలు ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిధిలో ఉంది. దీన్ని రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీసీ పరిధిలోకి చేర్చి ప్రభుత్వానికి నివేదించారు. ఇక్కడే ప్రజనన, మూలవిత్తనాలను నిల్వ చేయడం కోసం నిర్మించిన విత్తన నిల్వ గోదామును అక్టోబరు 1న ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి   ప్రారంభించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిధిలో ఉన్న ఈ భూమిని పక్కనే ఎఫ్‌టీసీ (రైతు శిక్షణా కేంద్రం) పరిధిలోకి చేర్చారు. తద్వారా ఆర్‌ఏఆర్‌ఎస్‌ సేకరణ భూమిని తక్కువ తీసుకుంటున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే 1930 ప్రాంతంలో నిర్మించిన అతిథి గృహం, చిరుధాన్యాల గోదాముగా ఉన్న బ్రిటీష్‌ హయాం నాటి బంగ్లా, వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థుల వసతి గృహం ఉంది. ఇదే స్థలంలో విత్తన నిల్వ కోసం మరో  గోదాము  పనులు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని ఓ నాయకుడు చెప్పినట్లుగా ఎఫ్‌టీసీ పరిధిలోకి చేర్చారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ఈ స్థలంతో సంబంధం లేనట్లు చూపించడం కలకలం రేపుతోంది. 


 256, 270-1, 270-2, 271 సర్వే నెంబర్లలో పొలం పొద్దుతిరుగుడులో ఎన్‌డీఎస్‌హెచ్‌ -1 ప్రభాత్‌ వంగడాన్ని ఇక్కడే రూపొందించారు. సమగ్ర సస్యరక్షణ పరిశోధన, ప్రజననం విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక్కడే కొన్ని దశాబ్దాలుగా శనగ పరిశోధన నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఎన్‌బీ ఈజీ -1 (నంద్యాల శనగ-1), ఎన్‌బీఈజీ -47, ఎన్‌బీఈజీ -49 కొత్త వంగడాలను రూపొందించారు. అంతర్జాతీయ సంస్థలు ఇక్రిషాట్‌, ఐఐపీఆర్‌ (కాన్పూర్‌) నేతృత్వంలో శనగలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే పొలంలో 1100 రకాల శనగ బీజనిధి (జర్మ్‌ప్లాజా)తో పాటు సస్యరక్షణ, సస్య విభాగం, దిగుబడి పెంచేందుకు కొత్త రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.


 నంద్యాల వైద్య కళాశాల కోసం 50 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో నెంబరు 341 జారీ చేసింది. ఈ 50 ఎకరాలు నూనెపల్లె గ్రామ పరిధిలో ఉన్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. కేటాయించిన భూమి, సర్వే నెంబర్లు ఆర్‌ఏఆర్‌ఎస్‌, ఎఫ్‌టీసీ (రైతు శిక్షణా కేంద్రం) నుంచి  ఎంత విస్తీర్ణం తదితర విషయాలు స్పష్టం చేయలేదు. దీని వెనుక స్థానిక అధికార పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నివేదికలో రెవెన్యూ అధికారులు పరిశోధనా భూమి అని పేర్కొనకుండా కేవలం ఫీల్డ్‌ భూమి (సాధారణ నేల) అని చూపించారు. దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమి కేటాయించడంపై అభ్యంతరం తెలుపుతూ, ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. పరిశోధనా భూమి విశిష్టతను, ప్రగతిని  వివరించారు. ఈ లేఖను బుట్టదాఖలు చేయడం వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


 సర్వే నెంబరు  261-ఏ, 261-బీ భూమి ఇది. ఇక్కడ పత్తిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నరసింహ రకాన్ని రూపొందించి, భారత ప్రధానిగా పీవీ నరసింహారావు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. శ్రీరామ, యాగంటి వంటి రకాలను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రైవేటు సంస్థలు చేసే హైబ్రిడ్‌ పరిశోధనల్లో పేరెంట్స్‌ (తల్లిదండ్రులు)గా ఈ క్షేత్రం నుంచి వెలువడే పరిశోధనల ఫలితాలను ఉపయోగించుకుంటున్నారు. 260 సర్వే నెంబరులోని భూమిలో ప్రైవేటు సంస్థలు క్రిమిసంహారక మందులను పరిశీలిస్తాయి. ఈ క్షేత్రంలో పరిశీలించిన తరువాతనే మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి.


257-బీ ఈ సర్వే నెంబరులోని పొలం. ఇక్కడ చిరుధాన్యాలతో పాటు జొన్న ప్రజననము, సస్యరక్షణ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో గత కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనల ద్వారా కొర్రలో ప్రసాద్‌, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, రేనాడు, గరుడ రకాలను, జొన్నలో ఎన్‌టీజే -5, ఎన్‌ -15తో పాటు 20 రకాలను రూపొందించారు. ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. దేశంలో మరెక్కడా లేనివిధంగా 2 వేల రకాల చిరుధాన్యాల జర్మ్‌ ప్లాజా నిధిని నిర్వహిస్తున్న ఏకైక స్థానం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌. ఈ భూమిలో చిరుధాన్యాలపై వచ్చే తెగుళ్ళపై పరిశోధనలు, రోగ పరిశీలన క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల చిరుధాన్యాల రకాలపై పరివోధనలు చేసి, తెగుళ్ళను తట్టుకునే రకాలను ధ్రువీకరిస్తారు.


 సర్వే నెంబరు257-ఏ1లో ఉన్న భూమిలో వరి రకాలలో జన్యు పరిశీలన, ప్రజననము (క్రాసింగ్‌), వైవిధ్య రకాల పరిశీలన, వరి భీజ నిధి (జర్మ్‌ ప్లాజా) నిర్వహిస్తున్నారు. ఇదే క్షేత్రంలో పరిశోధన ద్వారా వరిలో ఎన్‌డీఎల్‌ఆర్‌-7 (నంద్యాల సోనా) కొత్త వంగడాన్ని రూపకల్పన చేసి విడుదల చేశారు.  సేంద్రీయ వ్యవసాయ భూమిలో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. బీపీటీ -5204 (కర్నూలు సోనా), ఎన్‌డీఎల్‌ఆర్‌ -7 (నంద్యాల సోనా) మూల విత్తనోత్పత్తి జరుగుతోంది.


ఇవీ కేటాయింపులు

నంద్యాల వైద్య కళాశాలకు 234-ఏలో 7.05 ఎకరాలు (ఎఫ్‌టీసీ), 234-సీ1లో 5.78 ఎకరాలు (ఈ భూమి ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిధిలో ఉన్నప్పటికీ ఎఫ్‌టీసీలోకి చేర్చారు), 257-ఏ1లో 10.36 ఎకరాలు (ఆర్‌ఏఆర్‌ఎస్‌), 257-బీలో 2 ఎకరాలు (ఆర్‌ఏఆర్‌ఎస్‌), 256లో 2.35 ఎకరాలు (ఆర్‌ఏఆర్‌ఎస్‌), 261-ఏలో 2.51 ఎకరాలు(ఆర్‌ఏఆర్‌ఎస్‌), 261-బీలో 2.58 ఎకరాలు(ఆర్‌ఏఆర్‌ఎస్‌), 260లో 3.45 ఎకరాలు(ఆర్‌ఏఆర్‌ఎస్‌), 270-1లో 6.90 ఎకరాలు(ఆర్‌ఏఆర్‌ఎస్‌), 270-2లో 3.58 ఎకరాలు(ఆర్‌ఏఆర్‌ఎస్‌), 271లో 2.80 ఎకరాలు (ఆర్‌ఏఆర్‌ఎస్‌), మొత్తం 49.36 ఎకరాలను కేటాయించారు. 



నిర్వీర్యం చేసే దిశగా..

దేశ వ్యాప్త గుర్తింపు,  వందేళ్ళకు పైబడి చరిత్ర ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ అగ్రస్థానం ఉంది. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొత్త వంగడాల రూపకల్పనతో పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. కానీ ఇంతటి గొప్ప సంస్థను నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్రణాళికలో ముందుకు పోతోంది. ప్రభుత్వం తీరుపై రైతులు, రైతు సంఘాలు, ప్రజలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆర్‌ఏఆర్‌ఎస్‌ను అభివృద్ధి చేస్తామని, వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మారుస్తామని హామీ ఇచ్చాయి. అవన్నీ అటకెక్కాయి. రూ.వందల కోట్ల విలువ చేసే పరిశోధనా భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. వైద్య కళాశాలకు 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆర్‌ఏఆర్‌ఎస్‌ చుట్టూ అధికార పార్టీ నాయకులకు వందలాది ఎకరాల భూమి, స్థలాలు, భవనాలు ఉన్నాయి. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు అయితే, వాటి విలువ మూడింతలు పెరుగుతుందని అంచనా. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్న ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అగ్రి వర్శిటీ ఏర్పాటుకు కృషి చేయాల్సిందిపోయి, మొత్తం భూమిని ఇతర అవసరాలకు బదలాయించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



నెల రోజులుగా పోరాటం

నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు పరిశోధనా భూమి లో పని చేసే 300 కుటుంబాల కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్నారు. దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమి బదలాయింపు వెనుక చక్రం తిప్పింది వీరేనని, అందుకే నోరు మెదపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. 


కార్మికుల పోరాటానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు రంగంలోకి దిగారు. పోరాట కార్యాచరణకు సిద్ధమయ్యారు. త్వరలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను చెప్పాలని నిర్ణయించారు. వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తూనే ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాకుండా పట్టణం చుట్టూ ఉన్న భూముల్లో అనుకూలమైన చోట సేకరించాలని, ఇందుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరాలని నిర్ణయించారు. ఇందుకు సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామని, లేదంటే పోరాటాన్ని కొనసాగిస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి స్పష్టం చేస్తున్నారు.



Updated Date - 2020-12-11T05:51:04+05:30 IST