లాక్‌డౌన్‌ కఠినతరం

ABN , First Publish Date - 2020-04-01T10:42:59+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

లాక్‌డౌన్‌ కఠినతరం

 మార్కెట్లలో క్యూ పాటిస్తున్న ప్రజలు

 రైతు బజార్ల వద్ద తగ్గిన రద్దీ 

  నిబంధనలు పాటించాలని  పోలీసుల సూచనలు


కర్నూలు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.  ప్రజలు నిబంధనలు పాటించేలా చేయడానికి  మంగళవారం పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.  రైతు బజార్ల వద్ద ఆ టౌన్‌ పరిఽధి పోలీసులు మాత్రమే కాకుండా ట్రాఫిక్‌ పోలీసులు కూడా లాక్‌డౌన్‌ విధులు నిర్వహించారు. ప్రతి దుకాణం వద్ద క్యూ పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా క్యూ పాటించకపోతే దుకాణదారులదే  బాధ్యత అంటూ మైక్‌లలో హెచ్చరించారు.  దీంతో దుకాణాదారులు భౌతిక దూరం పాటించమని ప్రజలను కోరుతున్నారు. చికెన్‌, మటన్‌ విక్రేతలు  షాపుల వద్ద బాక్స్‌లు గీసి ప్రజలను నిబంధనలు పాటించమని సూచిస్తున్నారు. ప్రతి దుకాణం వద్దకు పోలీసులు  తిరుగుతూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు. 


సీ క్యాంపు రైతు బజారు వద్ద రోడ్డుకు రెండు వైపులా దుకాణాలు ఉండడం వల్ల వినియోగాదారులు భౌతిక దూరం పాటించ డం లేదని, రోడ్డుకు ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేయించారు. దీంతో వినియోగదారులకు క్యూలైన్‌లో వెళ్లి కూరగాయలను కొనుగోలు చేశాక  వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూడళ్ళలో  ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువ ప్రయాణించిన వారికి పోలీసులు చలానాలు విధించారు.  ఒకసారి కంటే ఎక్కువ సార్లు బయట తిరిగిన వారి బైక్‌లను సీజ్‌ చేశారు. 

 

 నేటి నుంచి సీ క్యాంపు రైతు బజారు బంద్‌

లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ప్రజలు కూరగాయలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైతు బజార్లను వికేంద్రీకరించారు. నగరంలో ఎనిమిది చోట్ల కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు ప్రధాన రైతు బజార్ల వద్ద ధరలు తక్కువగా ఉంటాయన్న అపోహతో ఇక్కడికి  వస్తున్నారు. దీంతో రద్దీ ఎక్కువ అవుతోంది.  దీంతో నగరంలో దాదాపు 21 చోట్ల కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి ప్రజలందరూ అక్కడే కొనుగోలు చేసుకోవచ్చని తెలియజేశారు. నేటి నుంచి సీ క్యాంపు రైతుబజారును మూసివేస్తున్నామని, ప్రజలందరూ ఈ  మార్కెట్లలో కొనుక్కోవాలని సూచించారు.

Updated Date - 2020-04-01T10:42:59+05:30 IST