ఆ సారు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2020-12-19T05:43:57+05:30 IST

జిల్లా వ్యవసాయ శాఖ 2018-19 సంవత్సరం నిధుల్లో రూ.97 లక్షల స్వాహాకు సంబంధించి అప్పటి జేడీ (ప్రస్తుతం రిటైర్డు) ఠాగూర్‌ నాయక్‌ బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య చర్యలు తీసుకోవడం కలకలం రేపింది.

ఆ సారు ఏం చేశారంటే..

  1. కళ్లు మూసుకుని సంతకాలు పెట్టేశారు
  2. రిటైర్డు జేడీఏపై చర్యలకు ఆదేశాలు
  3. మరో ముగ్గురు అధికారులపై వేటుకు సిద్ధం 


కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 18: జిల్లా వ్యవసాయ శాఖ 2018-19 సంవత్సరం నిధుల్లో రూ.97 లక్షల స్వాహాకు సంబంధించి అప్పటి జేడీ (ప్రస్తుతం రిటైర్డు) ఠాగూర్‌ నాయక్‌ బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య చర్యలు తీసుకోవడం కలకలం రేపింది. ఈ వివాదంపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఫోర్‌ మెన్‌ కమిటీ నివేదికను ప్రత్యేక కార్యదర్శి ఆమోదిస్తూ ఠాగూర్‌ నాయక్‌పై చర్యలు తీసుకునేందుకు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఓ జిల్లా అధికారి, మరో ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపైన కూడా చర్యలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2018లో జేడీఏ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసిన రాజేష్‌ నాలుగు బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి రైతుల కోసం కేటాయించిన సబ్సిడీ సొమ్ము దాదాపు రూ.97 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేష్‌ను సస్పెండ్‌ చేసి విచారణ కొనసా గిస్తున్నారు. ఏకంగా తన భార్య పిల్లలపై నగరంలోని స్టేట్‌ బ్యాంకులో అకౌం టును తెరిచి రైతుల కోసం ఉద్దేశించిన పథకాలకు, ప్రభుత్వ సబ్సిడీని బోగస్‌ కంపెనీల ద్వారా మంజూరు చేయించుకుని నిధులను మళ్లించుకున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ ఏర్పాటు చేసిన ఫోర్‌మెన్‌ కమిటీ నిర్ధారించింది. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ప్రస్తుత జేడీ ఉమామహేశ్వరమ్మతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది. 


అధికారుల బాధ్యతారాహిత్యం

చిరుద్యోగి రాజేష్‌ ప్రభుత్వ పథకాలకు మంజూరైన సబ్సిడీ నిధులను స్వాహా చేసి తన భార్య బ్యాంకు అకౌంటుకు మళ్లించుకున్న సంఘటనలో అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా ఉందని కలెక్టర్‌ ఏర్పాటు చేసిన ఫోర్‌మెన్‌ కమిటీ అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యమైన ఫైళ్లు జేడీఏ కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ద్వారా వివిధ స్థాయిలో అధికారులు ఆమోదించాక జేడీ ఆమోదానికి వెళ్లాలి. అయితే.. దశాబ్ద కాలంగా జేడీఏ కార్యాలయంలో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా ఫైళ్లు ఆమోదిస్తున్నారు. జేడీఏ స్థాయి అధికారి తనకు అనుకూలమైన ఏవోల ద్వారా ఫైళ్లను నేరుగా కార్యాలయానికి తెప్పించుకుని ఆమోదిస్తున్నారు. దీనివల్ల పథకాల్లో లోపాలను గుర్తించే అవకాశం లేకుండా పోతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు పథకాల నిర్వహణపై నివేదికలను జేడీ కార్యాలయానికి పంపిస్తారు. తర్వాత సూపరింటెండెంట్‌ మొదలు కుని కార్యాలయంలో పనిచేసే ఏవోలు, ఏడీఏలు, డీడీఏలు పరిశీలించాలి. చివరగా జేడీఏకి ఫైళ్లు వెళ్లాలి. దీన్నంతా పక్కన పెట్టి జేడీఏలు తమకు అనుకూలమైన ఏవోలు, క్లర్కులకే పూర్తి బాధ్యతలు అప్పగించి ముఖ్యమైన పథకాలను వారి ద్వారానే నిర్వహిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ఇలా చేయడం ఏమిటని కొంత మంది డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీఏలు, ఏవోలు జేడీఏని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాల ఫైళ్లను క్రమ పద్ధ్దతిలో ఏవోలు, ఏడీఏలు, డీడీలు పరిశీలించిన తర్వాతనే తన వద్దకు తీసుకురావాలని జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశాలు జారీ చేశారు.


బినామీ పేర్లతో..

జేడీ కార్యాలయం చిరుఉద్యోగిగా రాజేష్‌ కర్నూలు నగరంలోని కల్లూరు పారిశ్రామికవాడలో నాలుగు బోగస్‌ కంపెనీలను బినామీ వ్యక్తుల పేర్లతో నిర్వహించి వాటి ద్వారా పరికరాలను రైతులకు అందజేసినట్లుగా నకిలీ ధ్రువపత్రాలను సృష్టించారు. వీటి ద్వారా రూ.97 లక్షలు స్వాహా చేసిన వైనంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. కర్నూలు డీఎస్పీతో పాటు అప్పటి వ్యవసాయశాఖ డీడీ, మరో ఇద్దరు అధికారులతో ఏర్పాటైన ఫోర్‌మెన్‌ కమిటీ ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని, కళ్లు మూసుకుని చెక్కులపై సంతకాలు పెట్టారని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కలెక్టర్‌ ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంతో జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే కార్యక్రమం మొదలైంది. 

Updated Date - 2020-12-19T05:43:57+05:30 IST