కొత్త వైరస్‌పై టెన్షన్
ABN , First Publish Date - 2020-12-29T05:51:07+05:30 IST
కొత్త వైరస్ నేపథ్యంలో యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక నిఘా సారించారు. నెల నుంచి జిల్లాకు 48 మంది వచ్చినట్లు చెబుతున్నారు.
- యూకే నుంచి జిల్లాకు 48 మంది
- అందరికీ నెగెటివ్
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 28: కొత్త వైరస్ నేపథ్యంలో యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక నిఘా సారించారు. నెల నుంచి జిల్లాకు 48 మంది వచ్చినట్లు చెబుతున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రిపోర్టు నిర్ధారణ అయింది. వీరంతా జిల్లాకు బెంగళూరు, హైదరాబాదు ఎయిర్ పోర్టు నుంచి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం 14 మంది బ్రిటన్ నుంచి వచ్చినట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా కర్నూలు నగరంలో 29 మంది ఉన్నారు.
కాంటాక్ట్‌లకు పరీక్షలు
48 మంది కాంట్రాక్ట్‌లను గుర్తించే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 105 మంది కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సోమవారం నుంచి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూకే నుంచి వారు బయటకు రాకుండా హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరో నాలుగు కేసులు
జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 60,544కు చేరింది. ఇందులో 61 యాక్టివ్ కేసులు కాగా 59,996 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకూ కొవిడ్ టీకా
జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకూ కొవిడ్ టీకాను వేయనున్నట్లు కొవిడ్ వ్యాక్సిన్ కో ఆర్డినేటర్ డా.జె.రేఖ తెలిపారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓల్డ్ సీఎల్‌జీలో రిజిస్టర్ అయిన ప్రైవేటు హాస్పిటల్స్ పొటెన్షియల్ వ్యాక్సినేటర్లకు శిక్షణ జరిగింది. డా.జె.రేఖ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లోని హెల్త్ కేర్ వర్కర్ల వివరాలు diokurnool@gmail.com అప్‌లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి జె.రఘురాం, డిప్యూటీ డెమో ప్రకా్‌షరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్లు పద్మావతి, ఆదినారాయణ పాల్గొన్నారు.