భక్తులతో ఆలయాలు కిటకిట

ABN , First Publish Date - 2020-12-07T05:11:49+05:30 IST

మహానంది క్షేత్రంలో ఆదివారం కార్తీకమాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు.

భక్తులతో ఆలయాలు కిటకిట
కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రద్దీ

మహానంది, డిసెంబరు 6: మహానంది క్షేత్రంలో ఆదివారం కార్తీకమాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు తెల్లవారుజామున 5గంటల నుండి రాత్రి 9గంటల వరకు నిరంతర దర్శనం కల్పించారు. ఈసందర్బంగా ప్రధాన ఆలయాలను ఽభక్తులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో కాయకర్పూరాలను సమర్పించుకొన్నారు. మహిళ భక్తులు ఆలయపరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి. కార్తీక నాలుగో సోమవారం మహానందిలో మరింత భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది అని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో అందించే సాంబారు అన్నం ప్యాకెట్లు తగినంతగా నాణ్యత లేదని భక్తులు చెప్పారు. రుచితో పాటు నాణ్యత గల అన్న ప్రసాదాన్ని అందించాలని భక్తులు కోరారు.

 

పాణ్యం: కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం మూడో ఆదివారం కావడంతో భక్తులు పెద్దఎత్తున స్వామి వారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులను కంట్రోల్‌ చేయడానికి అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పాణ్యం, నందివర్గం పోలీసుసిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. కరోనా కారణంగా కేవలం దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేశారు. నాలుగు గంటలసేపు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిసితి ఏర్పడింది. నందివర్గం, కొత్తూరు మద్య రెండు కిలోమీటర్ట మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తూరు, నందివర్గం ఆర్‌అండ్‌బీ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. అన్నసత్రంలో భోజనం తినడానికి అనువైన స్థలం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ప్రత్యేక పూజలు 

కార్గీక షష్టి కావడంతో స్వామి వారికి ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలంగి, నైవేద్య, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు నారాయణ శర్మ, సురేష్‌ శర్మ, సెబ్బయ్య శర్మ, సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాదు పాల్గొన్నారు. 


 ‘స్థలాన్ని సేకరించాలి’

 ప్రతి ఏటా పెరుగుతున్న భక్తులకు అనువైన స్థలం లేకపోవడంతో ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు అందడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. గర్భగుడితో పాటు క్యూలైను కు కావలసిన స్థలం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీని మరింత విశాలం చేయాలని కోరుతున్నారు. ఆలయానికి వచ్చే వాహనాలు నిలపడానికి గ్రామంలోని ప్రైవేటు స్థళలాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని భ్తులు పేరొన్నారు

Read more