దేవాలయాలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2020-12-13T05:49:33+05:30 IST
రాష్ట్రంలోని దేవాలయాలు, దేవాలయ ఆస్తులపై అరాచకవాదులు కన్నేశారని, వారిపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనీ టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ ఆరోపించారు.

- టీడీపీ నాయకులు సోమిశెట్టి, నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు (అగ్రికల్చర్), డిసెంబరు 12: రాష్ట్రంలోని దేవాలయాలు, దేవాలయ ఆస్తులపై అరాచకవాదులు కన్నేశారని, వారిపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనీ టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ ఆరోపించారు. గూడూరు మండలం పొన్నకల్లు గ్రామం లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పెకలించారని, గుప్త నిధుల కోసం ఈ దారుణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇటీవల హిందూ దేవాలయాలపై, సంస్కృతిపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయని అన్నారు. దేవదాయశాఖ, పోలీసు యంత్రాంగం కనీస విచారణ జరపడం లేదని ఆరోపించారు. దేవాలయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు.
గూడూరు: పొన్నకల్ సమీపంలోని పాత ఊరులో ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలను పెకిలించిన దుండగులను కఠినంగా శిక్షించి, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రాజు, మండల అధ్యక్షుడు జె.సురేష్ డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయాలపై, పంటలపై దాడులు పెరిగాయని వారు ఆరోపించారు. టీడీపీ నాయకులు మునగాల గోపాల్, పౌలు తదితరులు పాల్గొన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
పాత ఊరులో ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలను గుప్త నిధుల కోసం పెకిలించి ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ జడ్పీటీసీ ఎల్ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాలను టీడీపీ బృందం శనివారం పరిశీలించింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని అన్నారు. మరోమారు ఇలాంటి ఘటన జరగడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. టీడీపీ నాయకులు రేమట సురేష్, బతుకన్న, మాజీ సర్పంచ్ బజారి, మద్దిలేటి, శేఖర్, మల్లికార్జున, రాముడు, నాగరాజు, గోవిందు పాల్గొన్నారు.