-
-
Home » Andhra Pradesh » Kurnool » Tele medicine begins in district
-
కరోనాను అరికడతాం
ABN , First Publish Date - 2020-04-07T10:28:01+05:30 IST
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ

వైద్య పరికరాలు, మాస్కులు అందిస్తాం
ప్రజలు ఆందోళన చెందవద్దు
ఇళ్లలో ఉండి సహకరించాలి
వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని
జిల్లాలో టెలి మెడిసిన్ ప్రారంభం
కర్నూలు, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమ వారం కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమావేశానికి హాజరయ్యారు. ఆళ్ల నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించామని, అధికారులకు దిశా నిర్దేశం చేశామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,141 మంది కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించామని, 2,772 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు.
ఇప్పటిదాకా 266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఐదుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. వలంటీర్ల ఇంటింటి సర్వే చేయించి కర్నూలు జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 840 మందిని గుర్తించామని, వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన మొత్తం 357 మందిని గుర్తించి క్వారంటైన్‌లో చేర్పించామని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన 56 మందిని కోవిడ్-19 ఆసుపత్రులలో చేర్పించి వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నా, దురదృష్ట ఘటన వల్ల పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోందని అన్నారు. జిల్లాకు అవసరమైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు, ఎన్ 95 మాస్కులు, సర్జికల్ పరికరాలు, మందులను సిద్ధంగా ఉంచామని మంత్రి వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, విద్యార్థులకు సరిహద్దు ప్రాంతాల్లో 66 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వసతి, భోజన సదుపాయాలు కల్పించామని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అనునిత్యం దిశానిర్దేశం చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
జిల్లాలో కరోనా టెస్టింగ్ ల్యాబ్: బుగ్గన
కర్నూలులో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి తెలిపారు. ఐసీఎంఆర్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపామని అన్నారు. కరోనా అనుమానితుల శాంపిల్స్‌ను పరీక్షించడం కోసం హైదరాబాద్‌లోని కొన్ని ల్యాబ్‌లతో అనుసంధానం చేయిస్తున్నామని, త్వరగా రిపోర్టులు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
బయటకు రావద్దు: జయరాం
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని మంత్రి గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలో ఫ్రీ టెలి మెడిసిన్
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో ఫ్రీ టెలి మెడిసిన్‌ను ఏర్పాటు చేశామని, ప్రజలు వినియోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆరోగ్య విషయాల పట్ల సందేహాలు ఉన్న జిల్లా వాసులు 1077 నెంబరుకు ఫోన్ చేసి ఉచితంగా టెలి వైద్య సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. 1077 ఫ్రీ టెలి మెడిసన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో కలెక్టర్ జి.వీరపాండియన్, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ రవి తదితరులు పాల్గొన్నారు.