‘ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా ఒక్కో గోతిలో రెండు మృతదేహాలు పడేశారు’

ABN , First Publish Date - 2020-11-15T19:25:00+05:30 IST

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ కేసులో నమోదుచేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, విట్‌నెస్ సర్టిఫికెట్లు పరిశీలిస్తే అనేక వైరుధ్యాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

‘ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా ఒక్కో గోతిలో రెండు మృతదేహాలు పడేశారు’

విజయవాడ: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ కేసులో నమోదుచేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, విట్‌నెస్ సర్టిఫికెట్లు పరిశీలిస్తే అనేక వైరుధ్యాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 3న రైల్వేపోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెం-22/2020ని పరిశీలిస్తే, అందులో చెప్పినట్లుగా 264/ 6-7 పోస్టుల మధ్య, పాణ్యం-నంద్యాల రైల్వేస్టేషన్ల మధ్య, రైలుపట్టాలపై ఘటన జరిగిందని చెప్పారని, మ‌‌‌ృతదేహాలను చూసిన గ్యాంగ్‌మెన్ సురేశ్, స్టేషన్ మాస్టర్ శివప్రసాద్‌కి చెబితే, ఆయన రైల్వే పోలీసులకు 2.15నిమిషాలకు సమాచారం అందించారని, వెంకటేశ్వర్లు అనే రైల్వే ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకొని, 2-40 నుంచి సాయంత్రం 4: 40 నిమిషాలవరకు స్పాట్‌లోనే ఇన్విస్టిగేషన్ చేసినట్లుగా పేర్కొన్నారని పట్టాభిరామ్ తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ఘటనా స్థలం నుంచి మృతదేహాలు నంద్యాల ఆసుపత్రికి రావడానికి అరగంట సమయం పడితే, సాయంత్రం 5.30 నుంచి 6గంటల మధ్య అక్కడికి చేర్చి 6 గంటల తరువాత  చీకటి పడే వేళ పోస్టుమార్టం నిర్వహించారని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోస్టుమార్టం నిర్వహించకూడదనే నిబంధనను లెక్కచేయకుండా ఆ పని ఎలా చేశారో ముఖ్యమంత్రి, పోలీస్ శాఖ సమాధానం చెప్పాలని కొమ్మారెడ్డి డిమాండ్ చేశారు. 


ఎవరిఒత్తిడికి తలొగ్గి చీకటి పడ్డాక హడావుడిగా ఎందుకు పోస్టుమార్టం చేశారో చెప్పాలని, రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించే అనుమతులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లేనప్పటికీ ఎందుకలా చేశారో చెప్పాలని నిలదీశారు. అలా చేయాలంటే జిల్లా కలెక్టర్, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అనుమతి కావాలని, ఎలాంటి అనుమతులు లేకుండా, సరైన లైటింగ్ కూడా లేకుండానే సలాం కుటుంబ సభ్యుల మృతదేహాలకు తూతూమంత్రంగా నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం పూర్తిచేసి, మృతదేహాలను బంధువులకు అప్పగించారని ఆరోపించారు. అర్థరాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో హడావుడిగా ఖననం కార్యక్రమాన్ని పూర్తిచేశారని, ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా ఒక్కో గోతిలో రెండేసి మృతదేహాలను పడేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ సలాం అత్తగారైన మాబున్నీసా ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే, 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆమె నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో తన కుమార్తె, అల్లుడు, పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ తనకు 12:45 నిమిషాలకే ఫోన్ చేశారని అబ్దుల్ సలాం అత్తగారు మాబున్నీసా స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా చెప్పారని, రైల్వేట్రాక్‌పై మృతదేహాలున్నాయని రైల్వేపోలీసులకు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సమాచారం వస్తే, దానికంటే దగ్గరదగ్గర రెండు గంటల ముందే, ఆ విషయం నంద్యాల మూడో పట్టణ పోలీసులకు ఎలా తెలిసిందని పట్టాభిరామ్ ప్రశ్నించారు. 


‘‘నంద్యాల మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కాల్ లిస్ట్ తీస్తే ఆయనకు మార్గదర్శనం ఎవరు చేశారో తెలుస్తుంది. 3వ తేదీ ఉదయం 11 గంటలకు మాబున్నీసా తన కూతురు, అల్లుడు, పిల్లలు, కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే, 8వ తేదీన రైల్వేపోలీసులు కేసుని పోలీసులకు అప్పగించే వరకు, మిస్సింగ్ కేసుపై స్థానిక పోలీసులు ఎందుకు దర్యాప్తుచేయలేదు. కోర్టులో సీఐకి, కానిస్టేబుల్ గంగాధర్‌కి బెయిల్ రావడానికి ష్యూరిటీ ఇచ్చింది తాతిరెడ్డి తులసిరెడ్డి. అతను నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. తాతిరెడ్డి, తులసిరెడ్డి, అతని బావమరిది మద్దిలేటి స్వామిరెడ్డి ఇద్దరూ కోర్టులో దగ్గరుండి మరీ పోలీసులకు ష్యూరిటీలిచ్చారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జగన్ ప్రసాద్, శిల్పారవికిశోర్ ఆదేశాల ప్రకారం, అదేరోజు తన అనుచరులతో కోర్టుహాల్లో ఉన్నాడు. జామీను డబ్బుకట్టి, సంతకాలు ఎవరు పెట్టారో, రికార్డులు బయటకు తీస్తే, వాస్తవాలు తెలుస్తాయి. ఈ కేసులో మరో ముఖ్యమైన వ్యక్తి అయిన గంగిశెట్టి శ్రీధర్ వైసీపీ కార్యదర్శి.  అతను సలాం కుటుంబాన్ని వేధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విధంగా అనేక నిజాలను కప్పిపెట్టి, సలాం కుటుంబం చనిపోయే వరకు వేధించుకుతిన్నది ముమ్మాటికీ వైసీపీనేతలే. ఈకేసులో ఇన్ని మలుపులున్నాయి కాబట్టే, సీబీఐకి అప్పగించాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-15T19:25:00+05:30 IST