రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు

ABN , First Publish Date - 2020-12-01T05:52:21+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో రైతన్నలు కోలుకోలేనివిధంగా నష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారానికి నోచుకోలేదని, ప్రభుత్వానికి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు.

రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు
అమ్మిరెడ్డి నగర్‌లో వరి పంటను పరిశీలిస్తున్న అఖిలప్రియ

  1. న్యాయం జరగకపోతే ఆందోళనలు చేస్తాం 
  2. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ 
  3. పంటలను పరిశీలించిన వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు


దొర్నిపాడు, నవంబరు 30: నివర్‌ తుఫాన్‌తో రైతన్నలు కోలుకోలేనివిధంగా నష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారానికి నోచుకోలేదని, ప్రభుత్వానికి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం మండలంలోని అమ్మిరెడ్డినగర్‌, భాగ్యనగరం, అర్జునాపురం, కొండాపురం, దొర్నిపాడు గ్రామాల్లో నీట మునిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ లోపు నష్టపరిహారం అందించాలని, లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో తుఫాన్‌ల కారణంగా భారీగా నష్టపోయారని, అయితే ఇప్పటికీ వారికి ప్రభుత్వ పరిహారం అందజేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిరాశ్రయులకు తక్షణమే రూ.2 వేలు అందించామని, అయితే జగన్‌ రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం సీఎం జగన్‌ రైతులకు రూ.500 మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీడు వరి, సీడు పత్తి రైతులకు నష్టం వాటిల్లితే భూమా నాగిరెడ్డి ధర్నాలు చేసి పోరాడి రైతులకు న్యాయం చేశారన్నారు. కడప జిల్లా ప్రాంతంలోని అరటి రైతులకు నష్టపరిహారం అందేలా చూశారని, కర్నూలు జిల్లా రైతులకు మొండిచెయి చూపారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు రైతుల పక్షాన నిలిచి వారికి భరోసానిచ్చి సాయం అందేలా చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో రైతులకు న్యాయం చేకూర్చేందుకు ప్రతి గ్రామంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ నాయకులు సిద్ధి సత్యనారాయణ, లింగుట్ల వెంకటనాయుడు, పాలూరు నారాయణరెడ్డి, జిల్లా సుబ్బన్న, శాంతారావు, గవ్వల సుబ్బరాయుడు, బాబయ్య, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

తుఫాన్‌ బాధితులను ఆదుకోవాలి 

గోస్పాడు: నివర్‌ తుఫాన్‌ వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు. సోమవారం జిల్లెల్ల, యాళ్ళూరు గ్రామాలలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రైతులు రెండు సార్లు పంట నష్టాన్ని చవిచూశారని, ప్రభుత్వం హెక్టారుకు రూ.15 వేలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు. అయితే అది ఏమాత్రం రైతులకు సరిపోదని, కనీసం రైతులను అప్పుల్లో కూరుకుపోకుండా సాయాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పాలన గాడితప్పిందని, ఎవరికి వారే యమునాతీరుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడ్డాయని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, కనీసం రైతులను పరామర్శించడానికి కూడా రాకపోవడం శోచనీయమన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ ఏరాసు చంద్రశేఖర్‌రెడ్డి, పల్లె వెంకటేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, శీలం భాస్కర్‌రెడ్డి, చెన్నా కృష్ణారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.


చాగలమర్రి: నివర్‌ తుఫాన్‌ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం మద్దూరు, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న వరి, జొన్న, మినుము పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బ్రాహ్మణపల్లె గ్రామంలో గాయపడిన టీడీపీ నాయకుడు కిట్టును పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలకు భూమా కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. మాజీ ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా, టీడీపీ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఖాదర్‌బాషా, నాయకులు కొలిమి ఉసేన్‌వలి, ముల్లా శ్యాబుల్‌, గుత్తి నరసింహుడు, జెట్టి నాగరాజు, శేఖర్‌రెడ్డి, నాగూర్‌వలి, సుబ్రహ్మణ్యం, సంజీవరెడ్డి, దస్తగిరి, రైతులు పాల్గొన్నారు.


 నివర్‌ తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులందరికి నష్టపరిహారం అందజేయాలని బీజేపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్‌ బోరెడ్డి లక్ష్మీరెడ్డి కోరారు. మండలంలోని మల్లేవేముల,  నల్లపాడు, పెద్దబోదనం గ్రామాల్లో పంట పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. నవదీప్‌కుమార్‌రెడ్డి, ఓబులేసు, ఓబన్న, రాజు, ఓబయ్య, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

 

నంద్యాల: నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, నంద్యాల డివిజన్‌ కార్యదర్శి పుల్లా నరసింహులు డిమాండ్‌ చేశా రు. సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో వ్యవసా య శాఖ ఏడీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఏవో అయూ బ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘం నాయకులు శివారెడ్డి, సురేష్‌, హాసన్‌, ఏలియా, సుబ్రహ్మణ్యం, బాబయ్య, రైతులు పాల్గొన్నారు.


బండి ఆత్మకూరు: ప్రభుత్వం  నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరి రైతులను ఆదుకోవాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు కోరారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరి పంటను రామచంద్రుడు, రత్నమయ్య, సర్వారెడ్డి, డేవిడ్‌ పరిశీలించారు. సుబ్బరాయుడు, రామసుబ్బయ, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 


మహానంది: నష్టపోయున రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు. బాబాపక్రుద్దీన్‌ కోరారు.  మండలంలో వరదల వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు

Updated Date - 2020-12-01T05:52:21+05:30 IST