ధర బాగానే ఉంది కదా..!

ABN , First Publish Date - 2020-12-27T06:26:45+05:30 IST

పత్తికొండ మార్కెట్‌యార్డులో ఇద్దరు, ముగ్గురు రైతుల..

ధర బాగానే ఉంది కదా..!
పత్తికొండ మార్కెట్‌యార్డులో రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి

ఇద్దరు.. ముగ్గురు రైతుల వల్లే గొడవ

టమోటా రైతుల కష్టాన్ని తేలిగ్గా తీసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి


పత్తికొండ(కర్నూలు): పత్తికొండ మార్కెట్‌యార్డులో ఇద్దరు, ముగ్గురు రైతుల వల్లే అలజడి చెలరేగుతోందని, ధర బాగానే ఉంది కదా? అని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టమోటాకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న వైనంపై ఆంధ్రజ్యోతిలో ఇటీవల కథనాలు ప్రచురితమయ్యాయి. ఎమ్మెల్యే శనివారం మార్కెట్‌యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. పంట కొనుగోలు, గిట్టుబాటు ధరపై వ్యాపారులు, యార్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విలేఖరులతో మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు ఇబ్బందులు కలగకుండా సీఎం నాయకత్వంలో అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. పంట నాణ్యతను బట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, ఇద్దరు, ముగ్గురు రైతులు కావాలనే అలజడి సృష్టించినట్లు తెలుస్తోందని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు శ్రీరంగడు, శ్రీనివాసులురెడ్డి, జిట్టానాగేష్‌, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


రూ.270 నుంచి రూ.820 దాకా కొనుగోలు

మార్కెట్‌ యార్డుకు శనివారం 238 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. ఇందులో 32.5 క్వింటాళ్లు మార్కెట్‌యార్డు ద్వారా కొనుగోలు చేశాం. కాయను బట్టి రూ.320 నుంచి రూ.875 వరకు ధర పలికింది. గరిష్ఠంగా రైతుకు రూ.598 గిట్టుబాటు అయింది. వ్యాపారులు మిగిలిన పంటను రూ.272 నుంచి రూ.820 వరకు నాణ్యతను బట్టి కొనుగోలు చేశారు. గరిష్ఠంగా రైతుకు రూ.540 లభించింది. 

- శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు కార్యదర్శి 


రైతు కష్టం రైతుకే తెలుస్తుంది

తెల్లవారుజామున పొలానికి వెళ్లి ఎండలో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తాం. కష్టపడి సాగుచేసి కూలీలను పెట్టి, ఆటో ఛార్జీలు పెట్టుకుని పంటను అమ్మడానికి మార్కెట్‌కు తెస్తున్నాము. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఇదే విషయం ఎమ్మెల్యే దృష్టికి తెస్తే ధర బాగానే ఉంది కదా, మార్కెట్‌కు వస్తే ధర లేదని చెబుతారు? అన్నారు. సాగుచేసిన రైతుకే ఆ కష్టమేంటో తెలుస్తుంది.

 - పాండురంగడు, పత్తికొండ 


రైతులే చేశారా? ఎవరైనా చేయించారా?

సెప్టెంబరు 9వతేదీన పత్తికొండ టమోటా మార్కెట్‌ ప్రారంభమయింది. మూడు రోజుల క్రితం వరకు వ్యాపారులు మంచి ధరతో పంట కొనుగోలు చేశారు. టమోటా నాణ్యతను బట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. చిన్న కాయలు తెచ్చిన ఇద్దరు, ముగ్గురు రైతులు ధర తక్కువ పలకడంతో కావాలనే అలజడిలు సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే రైతులే అలా చేశారా? ఎవరైనా చేయించారా? అన్నది చెప్పలేం. ఏదేమైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఆదుకోవడం మా బాధ్యత. గత ఏడాది గిట్టుబాటు ధర కల్పించాం. ఈ రోజు కూడా మంచి ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులతో మాట్లాడితే సంతృప్తి వ్యక్తం చేశారు. 

- పత్తికొండ మార్కెట్‌యార్డును సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి


కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు

నా పేరు గోవిందమ్మ. పత్తికొండ మండలం పందికోన గ్రామం. అర్ధ ఎకరాలో టమోటా సాగు చేశాము. పెట్టుబడి రూ.50వేలు అయింది. ఇప్పటి వరకు మూడుసార్లు కోత కోశాం. మొదటి సారి 10గంపలు (30కిలోలు) తెస్తే జత గంపలు రూ.160 చొప్పున కొనుగోలు చేయగా 10శాతం కమీషన్‌ పోను రూ.720 చేతికి వచ్చింది. రెండోసారి 14గంపలు తేగా జత రూ.200 చొప్పున అమ్ముడుబోయాయి. కమీషన్‌ పోను రూ,1260 చేతికి వచ్చింది. ఈరోజు 18గంపలు మార్కెట్‌కు తెస్తే జత రూ.270 చొప్పున కొనుగోలు చేశారు. 10 శాతం కమీషన్‌ రూ.2190 చేతికి వచ్చింది. మొదటిసారి ముగ్గురు కూలీలకు రూ.250 చొప్పున రూ.750, ఆటో చార్జీ గంపకు రూ.15 చొప్పున రూ.150 మొత్తం రూ.900 ఖర్చు అయింది. పంట అమ్మగా చేతికి వచ్చింది రూ.720. రెండోసారి నలుగురు కూలీలకు రూ.1000, ఆటో ఖర్చులు రూ.210 మొత్తం రూ.1210 ఖర్చు రాగా.. చేతికి వచ్చింది రూ.1260. ఈ రోజు ఐదుగురు కూలీలకు రూ.1250, ఆటో ఖర్చు రూ.270 మొత్తం రూ.1520 ఖర్చు అయింది. పంట అమ్మగా రూ.2190 చేతికి వచ్చింది. కనీపం కోత, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. ఇలా అయితే మా కష్టం మాటేంటి? పెట్టుబడి సంగతేంటి? 


Updated Date - 2020-12-27T06:26:45+05:30 IST