వైభవంగా స్వాతి ఉత్సవం

ABN , First Publish Date - 2020-12-12T05:21:26+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శుక్రవారం లక్ష్మీనారసింహుడి స్వాతి ఉత్సవాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా స్వాతి ఉత్సవం
సుదర్శనహోమం నిర్వహిస్తున్న వేదపండితులు

ఆళ్లగడ్డ, డిసెంబరు 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శుక్రవారం లక్ష్మీనారసింహుడి స్వాతి ఉత్సవాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మల్లికార్జునప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి, అర్చక బృందం తదితరులు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన  ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం దిగువ అహోబిలంలో సుదర్శన హోమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సమక్ష్యంలో అర్చక బృందం వేద మంత్రాలతో జేష్టాభిషేకం, 108 కళశాలతో నవ నారసింహులకు అభిషేకం నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కారంజ, ఉగ్ర, వరహా, మాళోల, జ్వాలా, పావన, యోగానంద, ఛత్రవట, భార్గవ క్షేత్రాలలో సైతం వేద పండితులు ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. స్వాతి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 




Updated Date - 2020-12-12T05:21:26+05:30 IST