ప్రజల జీవితాలతో చెలగాటం
ABN , First Publish Date - 2020-03-02T11:18:22+05:30 IST
ప్రజల జీవితాలతో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ, వైసీపీపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల ధ్వజం
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన
గూడూరు, మార్చి 1: ప్రజల జీవితాలతో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గూడూరులో ఆదివారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి గూడూరు జేఏసీ ఈ సభను నిర్వహించింది. అంతకు మునుపు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీకి అధికారం కట్టబెట్టి పొరపాటు చేశామని ప్రజలు పశ్చాత్తాపం చెందుతున్నారని అన్నారు. పౌరసత్వ చట్టంపై ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడడం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి తగదని అన్నారు. పార్లమెంటులో అడిగేవారు లేరని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా బిల్లులు తీసుకువస్తోందని అన్నారు. ఎన్‌ఆర్‌సీని తాను వ్యతిరేకిస్తున్నానని, టీడీపీ తరపున ముస్లింలకు అండగా నిలుస్తామని అన్నారు.
వివరాలు చెప్పకండి: గఫూర్
ఎన్‌పీఆర్ పేరిట ఇంటింటికి వచ్చి వివరాలు అడిగితే చెప్పకుండా వెనక్కు పంపాలని ప్రజలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ సూచించారు. పౌరసత్వ సవచణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రంతో ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, టీడీపీ నాయకులు ఆకెపోగు ప్రభాకర్, కరుణాకర్‌రాజు, విజయల్ రెడ్డి, చంద్రారెడ్డి, చరణ్‌కుమార్, నాయకులు జయరాజ్, రాజారెడ్డి, సుభాకర్, జేఏసీ నాయకులు అస్లాం, జిలానీ, నజీర్ అహ్మద్, షాషా, ముస్లిం మత పెద్దలు, యువకులు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.