ఎన్‌ఆర్‌పీపై తీర్మానం చేయాలి
ABN , First Publish Date - 2020-03-08T13:02:04+05:30 IST
ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లను రద్దు చేయాలని, ఎన్‌పీఆర్ అమలు చేయకుండా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి

- సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ
కర్నూలు (కల్చరల్): ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లను రద్దు చేయాలని, ఎన్‌పీఆర్ అమలు చేయకుండా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ముస్ల్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జేఏపీ కన్వీనర్ మౌలానా జాకీర్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బాంసెఫ్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేష్‌రా, మాలేగావ్ నాయకులు అబ్దుల్ హమీద్ అన్సారీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సాఖిబ్ సా, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ కేఎస్ లక్ష్మణ్‌రావు, ముంబాయి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కోల్సే పాటిల్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్యక్షురాలు లుబ్నాసిరాజ్, క్రిస్టియన్ జేఏపీ కార్యదర్శి అనిల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కావడం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దేశంలోని అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అలాగే బీజేపీ మిత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కేరళ, బెంగాల్, పంజాబ్, తెలంగాణ, రాజస్థాన్ వంటి 15 రాష్ట్రాలు ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నాయని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఎన్‌పీఆర్ చేపట్టబోమని అసెంబ్లీలో తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కూడా వైసీపీ, టీడీపీ రెండూ కలిసికట్టుగా ఎన్‌పీఆర్ చేపట్టబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఢిల్లీలో సర్వం కోల్పోయిన వారిని కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల అసంతృప్తిని పక్కదారి మళ్లించేందుకే ఈ చట్టాలు...
మోదీ ప్రభుత్వంపట్ల ప్రజల అసంతృప్తిని పక్కదారి మళ్లించేందుకే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ చట్టాలను తీసుకువచ్చిందని వక్తలు విమర్శించారు. ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విషలమైందని ఆరోపించారు. అందుకే ఈ చట్టాలను ముందుకు తెచ్చి దేశాన్ని మతం ప్రాతిపదికన చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సభలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎండీ ఆనంద్‌బాబు, నాయకులు పి. నిర్మల, గౌస్ దేశాయ్, ఇక్బాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, ముస్లిం జేఏసీ కో కన్వీనర్ జుబేర్ మౌలానా, క్రిస్టియన్ జేఏసీ నాయకులు ఎస్. ప్రభుదాస్, రెవ.విలియమ్స్, దళిత సీనియర్ నాయకుడు, న్యాయవాది జయరాజ్ పాల్గొన్నారు.