పులుల గణన

ABN , First Publish Date - 2020-03-02T11:03:10+05:30 IST

ఏపీ, తెలంగాణలకు తలమానికమైన నల్లమల అడవుల్లో పెద్ద పులుల లెక్కింపు మొదలైంది.

పులుల గణన

నల్లమల ఏపీ పరిధిలో 46, తెలంగాణలో 28

దేశానికెల్లా అతి పెద్ద టైగర్‌ ఫారెస్టు శ్రీశైలం 


రుద్రవరం, మార్చి 1: ఏపీ, తెలంగాణలకు తలమానికమైన నల్లమల అడవుల్లో పెద్ద పులుల లెక్కింపు మొదలైంది. శ్రీశైలం, నాగార్జున టైగర్‌ ఫారెస్టు అధికారుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న మొదలైన లెక్కింపు మార్చి 20 వరకు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాలను మూడు బ్లాక్‌లుగా విభజించారు.  దోర్నాల, ఆత్మకూరు, గిద్దలూరు, ఆత్మకూరు డివిజన్‌లను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆత్మకూరు, దోర్నాలలో పెద్దపులుల లెక్కింపు పూర్తయింది. నంద్యాల, గిద్దలూరు ఫారెస్టు డివిజన్‌లలో కొనసాగుతోంది. 


ఏపీలో 46, తెలంగాణలో 28 పెద్దపులులు 

నల్లమల పరిధిలోని ఏపీలో 46 పెద్ద పులులు, తెలంగాణలో 28 పెద్ద పులులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పులుల సంఖ్య పెరిగే కొద్ది వాటికి ఆహారం, తిరిగేందుకు అటవీ విస్తీర్ణం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పులి తిరిగేందుకు 4 వేల హెక్టార్ల విస్తీర్ణం అవసరం. టైగర్‌ ఫారెస్టులో పెద్దపులు 2015లో 16, 2016లో 18, 2017లో 23, 2018లో 23, 2019లో 23 ఉన్నట్లు ఫారెస్టు రికార్డులు తెలుపుతున్నాయి. 


162 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు 

నల్లమలలో పెద్దపులులు లెక్కించేందుకు 162 కెమెరా ట్రాప్‌లు ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అడవిలో ఎవరూ గుర్తు పట్టకుండా కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వన్యప్రాణులను ఆ కెమెరా ట్రాప్‌లు బంధిస్తాయి. 



టైగర్‌ ప్రాజెక్టు ఇలా.. 

భారత దేశంలో నాగార్జున సాగర్‌ టైగర్‌ ఫారెస్టు అతి పెద్దది. దీన్ని రాజీవ్‌గాంధీ, శ్రీశైలం టైగర్‌ ఫారెస్టు అని పిలుస్తారు. 


టైగర్‌ ఫారెస్టు విస్తీర్ణం ఇలా.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టైగర్‌ ఫారెస్టు 3,728 స్క్వెయర్‌ కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఏపీలో ప్రకాశం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 


పెద్దపులి జీవిత కాలం ఇలా.. 

పెద్దపులి  18 నుంచి 20 సంవత్సరాలు జీవిస్తుంది. ఆడ పెద్దపులి దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు పిల్లలు వేట, ఈత తదితర విద్యలు  నేర్చుకుంటాయి. మగ పులి పిల్ల 4 సంవత్సరాల తరువాత తల్లి నుంచి వేరై పోతోంది. ఇక తల్లి దగ్గరకు రావు. ఆడ పులి పిల్లలు మాత్రం తల్లి పులి దగ్గరలోనే ఉంటాయి. అప్పుడప్పుడు తల్లి పులిని కలుస్తుంటాయి. 


పెద్దపులి టెరిటరి 25 కి.మీ 

అడవిలో పెద్దపులి ప్రతి రోజూ 25 కి.మీ తిరుగుతుంది. ఒక పెద్దపులి తన సామ్రాజ్యాన్ని 25 కి.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటుంది. చెట్ల కొమ్మల బెరుడు గీరి, మూత్రం పోసి గుర్తు పెట్టుకుంటుంది. రోజుకు 50 సార్లకు పైగా మూత్రం పోస్తుంది. 


నల్లమలలో పెద్దపులుల లెక్కింపు ప్రారంభం: శివశంకర్‌రెడ్డి, డీఎ్‌ఫవో, నంద్యాల 

నల్లమల అడవిలో పెద్ద పులుల లెక్కింపు ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు ఈ లెక్కింపు కొనసాగుతుంది.  పెద్ద పులుల సంరక్షణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం.     

Updated Date - 2020-03-02T11:03:10+05:30 IST