-
-
Home » Andhra Pradesh » Kurnool » Sreesailam News In Kurnool Distict
-
శ్రీశైలంలో విశేష పూజలు
ABN , First Publish Date - 2020-12-28T05:27:45+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో లోక కల్యాణం కోసం ఆదివారం సుబ్రహ్మణ్య(కుమారస్వామి) స్వామికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు.

శ్రీశైలం, డిసెంబరు 27: శ్రీశైల క్షేత్రంలో లోక కల్యాణం కోసం ఆదివారం సుబ్రహ్మణ్య(కుమారస్వామి) స్వామికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, మంగళహారతులు నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామికి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చే శారు.
శ్రీశైలం క్షేత్ర ఆలయంలోని నందీశ్వరుడికి పూజలు నిర్వహించారు. అభిషేకంలో భాగంగా శనగల బసవయ్యకు పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మెదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో అభిషేకాన్ని చేశారు. పురుషసూక్తం, వృషభసూక్తం మోదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం నందీశ్వరస్వామికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు చేశారు.
వైభవంగా పల్లకి సేవ
శ్రీశైల మహక్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేసి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు.