సారీ... వినాయకా!

ABN , First Publish Date - 2020-08-22T10:19:47+05:30 IST

కైలాసం.. పొద్దున్నే వినాయకుడు హడావుడిగా ముస్తాబవుతున్నాడు. ఆయ

సారీ... వినాయకా!

నవరాత్రి ఉత్సవాలకు కొవిడ్‌ ఎఫెక్ట్‌

వీధుల్లో భారీ విగ్రహాల్లేవు, వేడుకల్లేవు

ఇండ్లకే పరిమితమైన పండుగ


కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 21: కైలాసం.. పొద్దున్నే వినాయకుడు హడావుడిగా ముస్తాబవుతున్నాడు. ఆయన వాహనం మూషికానికి సందేహం వచ్చింది. ‘ఏమిటి స్వామీ..? పెందలకడనే ఎక్కడికో సిద్ధమవుతున్నారు..?’ అని అడిగింది. దానికి విఘ్ననాయకుడు గుంభనంగా నవ్వి ‘మూషికా... భూలోకంలో ఈరోజు నా పుట్టిన వేడుకలు మొదలవుతున్నాయి నీకు తెలియదా..?’ అన్నాడు. ‘ఔను స్వామీ..ఆ విషయం మరిచేపో యాను. క్షమించండి. మానవులు మీకు సమర్పించే ఊండ్రాళ్లు, చిత్రాన్నం, బెల్లం పాయసం, మినప గారెలు, వడలు, పెరుగన్నం కడుపార ఆరగించి ఏడాదైంది.


పదండి. నోరూరుతోంది’ అంటూ సిద్ధమైంది. అప్పుడే అటుగా వచ్చిన పార్వతీదేవి వీరిని చూసి ‘నాయనా గణేశా.. పుట్టినరోజున ఎప్పటిలా భూలోక యాత్రకు బయల్దేరావా? కానీ ఈ ఏడాది అక్కడ పరిస్థితి బాగాలేదు. కరోనా అనే రక్కసి ఉంది. అది పిల్లాపాప, పెద్దా చిన్నా, ధనిక పేద అనే భేదం లేకుండా అందర్నీ కబళిస్తోంది. జాగ్రత్త’ అని హెచ్చరించింది. ‘భూలోకంలో నా పుట్టినరోజు వేడుకలను ఎంత వైభోగంగా చేస్తారో తెలుసుకదా..? నేను వెళ్లక పోతే వారు నొచ్చుకుంటారమ్మా...! వెళ్లేసి అలా సాయంత్రానికల్లా వచ్చేస్తాలే..!’ అంటూ బయల్దేరాడు.


గణనాఽథుడు భూలోక యాత్రను కర్నూలు జిల్లావైపుగా ప్రారంభించాడు. గణపతి ఊహించిన దానికి భిన్నంగా నగరం కనిపించింది. ఎక్కడ కోలాహలం లేదు. ఇది చూసి మూషికుడికి మళ్లీ సందేహం కలిగింది. ‘ఏమిటి ఇలా.. అని స్వామీ.. ఈ ఏడాది నన్ను ఇక్కడికి కొత్తగా తీసుకువస్తిరి. అదేం చోద్యమో.. భూలోకంలో కాలుమోపగానే ఆకలి విజృంభిస్తోంది. కానీ ఇక్కడ మీరు చెప్పిన హడావిడి ఏమీ కనిపించడం లేదు. ‘స్వామీ.. రోడ్లన్నీ తిప్పారుగానీ ఇక్కడా ఉత్సవాల సందడి కనిపించడం లేదే..?’


అని అడిగాడు మూషికుడు. గణపతికి కూడా అదే అనుమానం కలిగింది. ‘ఏటా ఈ వీధుల్లో, కూడళ్లల్లో, చౌరస్తాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి, వాటిని అందంగా ముస్తాబు చేసి, లౌడ్‌స్పీకర్ల హోరులో ఎంత సందడి నెలకొని ఉండేది..? ఈ ఏడాది ఆ సందడే కరవైంది కదా..?’ అని నిట్టూర్చాడు. మూషికుడు అందుకుని ‘సరే స్వామీ.. నవరాత్రి ఉత్సవాల సంగతి వదిలేయండి. పండుగ పూట ఎవరింటికైనా తీసుకెళ్లి మంచి విందుభోజనం పెట్టించండి’ అన్నాడు. 

 

రైతింట గణేశుడు..

గణేశుడికి అర్థమైంది. ఈ ఇంట్లో వేడుకలు లేవనుకున్నాడు. రైతే దేశానికి రాజు. రైతన్న ఇంట ప్రతి పండుగ వైభవంగా జరుగుతుంది కదా. అందుకని వెంటనే తన భక్తుడైన ఒక రైతన్న ఇంటివైపు అడుగులేశాడు. వినాయక చవితి రోజున రైతు ఇంటిముందు కల్యాపి జల్లి, ముత్యాల ముగ్గులు వేసి, ద్వారాలకు మామిడాకులు కట్టి, మట్టి విగ్రహంతో పూజలు, పిండివంటలతో నైవేద్యాలు మూషికుడికి గుర్తుకు వచ్చాయి. ఈ ఇంట్లో మూషికునికి కడుపు నిండా భోజనం పెట్టించాలని గణపతి కూడా ఆశించాడు. కానీ ఆ ఇంట్లో వేడుకలు లేవు. అన్నీ వేదనలే. ఆ రైతింటి కష్టాలు చూసి గణపతికి కళ్లు చెమర్చాయి.


ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పొలం పనులు చేయలేని పరిస్థితి. ఇంకా కరోనా నేపథ్యంలో కూలీలు కూడా రావడం కష్టంగా మారింది. ‘గణేశా...ఈఏడాది మాకష్టాలు తొలగిస్తే...వచ్చే ఏడాదైనా నీకు పిండివంటల నైవేద్యాలు పెట్టి, మనసారా పూజిస్తాం స్వామీ..’ .అంటూ దిగాలుగా ఉన్న రైతు కుటుంబాలను చూసి, శుభం.. కలుగుగాక! అంటూ నెమ్మదిగా నిట్టూర్చి బయల్దేరాడు వినాయకుడు. 


వెలవెల పోతున్న వ్యాపారాల వద్ద 

కరోనా రక్కసి ప్రభావంతో నగరంలో సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ మూసి ఉన్నాయి. లాడ్జీలు, హోటళ్లదీ అదే పరిస్థితి. వర్తక సముదాయాలన్నీ బోసిపోయి కనిపించడంతో వినాయకుడికి చాలా బాధ వేసింది. మూషికుడు కూడా అది గమనించాడు. ‘స్వామీ...ఈసారి ఓ వ్యాపారవేత్త అయిన మీ భక్తుని వద్దకు వెళదాం.. ఎంతైనా వ్యాపారంలో అంతో ఇంతో సంపాదించి ఉంటారు. పండుగపూట ఇంత పాయసం అయినా దక్కుతుంది’ అన్నాడు. 


వినాయకుడు ‘సరే.. .పద’ అన్నాడు. వ్యాపారి ఇంటికి బయటవైపు కొట్టు ఉంది. వెనుక కాపురం ఉంటున్నాడు. బయట జనం మూగి ఉన్నారు. కిరాణ వస్తువులు దొరుకుతాయో, అయిపోతాయో? అన్న హడావిడిలో ఉన్నారు. వాళ్లలో ఒక్కరూ మాస్కులు కట్టుకోలేదు. శానిటైజర్‌ స్పృహే లేదు. వీరికి కరోనా అంటే భయం లేదా..? అనే సందేహం వచ్చింది వినాయకుడికి. ‘స్వామీ మనం వీరి మధ్య నుంచి వెళ్లి నైవేద్యాలు స్వీకరించడం కన్నా, శుభ్రంగా పంపునీళ్లు తాగి ఈ పూట గడిపితే చాలు.. రండి స్వామీ’ అని పక్కకి లాక్కుపోయాడు. అయ్యో.. అనుకుంటూ ఇద్దరూ భారంగా అడుగులు వేస్తుండగా ఒక సామాన్యుడి ఇల్లు కనిపించింది. 


                                                              నిరుపేద ఇంట.. 

Updated Date - 2020-08-22T10:19:47+05:30 IST