వెల్లంపల్లిని బర్తరఫ్ చేయండి
ABN , First Publish Date - 2020-11-26T05:51:46+05:30 IST
ఆర్యవైశ్యులను అవమానించిన దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివా్‌సను తక్షణమే బర్తరఫ్ చేయించాలని, లేకుంటే ఆర్యవైశ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సీఎం జగన్‌ను తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

- లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతాం
- ముఖ్యమంత్రికి సోమిశెట్టి హెచ్చరిక
కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 25: ఆర్యవైశ్యులను అవమానించిన దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివా్‌సను తక్షణమే బర్తరఫ్ చేయించాలని, లేకుంటే ఆర్యవైశ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సీఎం జగన్‌ను తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల విజయవాడ దుర్గమ్మ గుడి సమీపంలో ఈ నెల 22న ఆర్యవైశ్య ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి హోటల్ యాజమాన్యంతో అనుమతి తీసుకున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయమే అక్కడికి పోలీసులు వచ్చి సమావేశం నిర్వహించరాదని, వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారని, లేకపోతే అరెస్టు చేస్తామని హచ్చరించారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారని, ఆర్యవైశ్యుల సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చేత మంత్రి ఇలా చేయించారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ఆర్యవైశ్యులంతా అమరావతిలో సమావేశాన్ని పెట్టుకుంటే.. మంత్రి వెల్లంపల్లి ఇలా చేయడం దారుణమని అన్నారు. ఆర్యవైశ్యులపై ముఖ్య మంత్రికి గౌరవం ఉంటే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాటి కులం వారికి ద్రోహం చేసిన మంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. సభ్యత లేని వ్యక్తులను తన మంత్రివర్గంలో కొనసాగిస్తే జగన్ ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలు కావడం తథ్యమని అన్నారు.
తూతూమంత్రంగా..
తుంగభద్ర పుష్కరాల నిర్వహణ తూతూమంత్రంగా సాగు తోందని, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పుష్కరఘాట్లలో సరైన సౌకర్యాలు లేవని అన్నారు. భక్తులు తలపై నీళ్లు చల్లుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో పరిశుభ్రమైన నీటిని ఉండేలా చూడాల్సిన అధికారులు మురుగు నీటిని ఉంచడం దారుణమని అన్నారు. జిల్లాలో ఎక్కడా పుష్కరాల పండుగ వాతావరణం కనిపించడం లేదని, నిర్వహణలో లోపాలపై సీఎం జగన్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర పుష్కరాలు జరుగుతుంటే దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడకే పరిమితమయ్యారని విమర్శించారు.