కలకలం రేపిన ఎస్ఐ.. కొన్ని గంటలపాటు అదృశ్యం
ABN , First Publish Date - 2020-03-02T11:24:46+05:30 IST
ఉన్నతాధికారులు మందలించడంతో..

వెళ్లిపోతున్నా..!
ఒత్తిడి భరించలేక ఎస్‌ఐ అదృశ్యం
ఆందోళన చెందిన పోలీసులు, కుటుంబ సభ్యులు
తిరిగి రావడంతో కథ సుఖాంతం
రుద్రవరం(కర్నూలు): ఉన్నతాధికారులు మందలించడంతో మనస్తాపం చెందిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్‌ఐ విష్ణునారాయణ కొన్ని గంటల పాటు అదృశ్యమై కలకలం రేపారు. ‘బాధ కలుగుతోంది. భార్యా బిడ్డలకు దూరమౌతున్నాను. ఇదే నా లాస్ట్ మెసేజ్..’ అని పోలీసు ఉన్నతాధికారుల వాట్సాప్ గ్రూప్‌లో శనివారం సాయంత్రం ఆయన ఓ పోస్టు పెట్టారు. దీంతో అప్రమత్తమైన ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, శిరివెళ్ల సీఐ విక్రమ్ సింహా, ఆళ్లగడ్డ సీఐ రమణ శనివారం రాత్రి రుద్రవరం పోలీస్టేషన్‌కు చేరుకుని సమస్య తెలుసుకుని నచ్చజెప్పారు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన ఎస్‌ఐ విష్ణునారాయణ ఆదివారం తెల్లవారు జామున స్టేషన్‌కు వెళ్లారు. ఆ తరువాత ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సొంత వాహనంలో ఎటో వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ స్విచాఫ్ అయింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. సాయంత్రానికి ఆయన ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం లేనందుకే..: పోతురాజు, డీఎస్పీ
రుద్రవరం ఎస్‌ఐ విష్ణునారాయణ సమాచారం ఇవ్వకుండా సొంత వాహనంలో బయటకు వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో ఏం జరిగిందోనని వాకబు చేశాము. కడప జిల్లా తొండూరు మండలం సొంతకావూరులో ఉన్నట్లు తెలిపింది. చాగలమర్రి ఎస్‌ఐని పంపి పిలిపించాము. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయినందుకే ఇలా జరిగిందని ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు. విషయాన్ని ఎస్పీ ఫక్కీరప్పకు ఫోన్ ద్వారా తెలియజేశాము.
ఒత్తిడి భరించలేక వెళ్లా..: విష్ణునారాయణ, ఎస్‌ఐ
విధి నిర్వహణ, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ప్రశాంతత కోసం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాను. తొండూరు మండలం సొంతకావూరుకి వెళ్లి ఆత్మీయులను కలుసుకున్నాను. న్యూస్ ఛానళ్లలో నా గురించి వస్తున్న కథనాలు చూసి అధికారులతో మాట్లాడాను. తిరిగి వచ్చి ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజును కలిసి నా సమస్య వివరించాను.