సచివాలయ ఉద్యోగులు కీలకం

ABN , First Publish Date - 2020-03-02T11:19:42+05:30 IST

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలకమని, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కలలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు.

సచివాలయ ఉద్యోగులు కీలకం

 శిక్షణలో కలెక్టర్‌ వీర పాండియన్‌

గైర్హాజరైన 90 మందికి నోటీసులు


కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 1:  ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలకమని, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కలలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు. సునయన ఆడిటోరియంలో ఆదివారం డిజిటల్‌ అసిస్టెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించి, పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. విధులకు తప్పకుండా హాజరు కావాలని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు 543 రకాల ప్రభుత్వ సేవలను అందించాల్సి ఉంటుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ప్రతి సోమవారం నిర్వహించే స్పందనకి వినతులు తగ్గుతాయని అన్నారు.


జిల్లాలో 30 సచివాలయాలు ప్రజలకు సేవలు అందించడంలో వెనుకబడ్డాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో ప్రతిరోజు స్పందన నిర్వహించాలని అన్నారు. దశల వారీగా సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తామని కలెక్టర్‌ తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 90 మంది డిజిటల్‌ అసిస్టెంట్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవోను ఆదేశించారు. భవిష్యత్తులో శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 


జాయింట్‌ కలెక్టర్‌ రవి మాట్లాడుతూ ఉద్యోగులు వన్‌ బి, అడంగల్‌, మ్యుటేషన్‌, కొత్త రేషన్‌కార్డులు, పింఛన్‌ తదితర అంశాల్లో సంపూర్ణ శిక్షణ పొందాలని అన్నారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌తో అనుసంధానం చేసి సాంకేతిక సమస్యల పరిష్కారానికి గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఇచ్చిన సూచనలను సీరియస్‌గా తీసుకోవాలని, పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, డ్వామా పీడీ మురళీధర్‌, డీపీవో ప్రభాకర్‌రావు, డీఎస్‌వో పద్మశ్రీ, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T11:19:42+05:30 IST