అవుకు ఎస్‌ఐపై ఎస్సీ, ఎస్టీ కేసు
ABN , First Publish Date - 2020-12-13T06:01:47+05:30 IST
అవుకు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు శనివారం నమోదైంది. తనపట్ల ఎస్‌ఐ దురుసుగా వ్యవహరించారని మండలం లోని ఇస్రానాయక్ తండాకు చెందిన వర్త్య జయరాముడు నాయక్ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు.

అవుకు, డిసెంబరు 12: అవుకు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు శనివారం నమోదైంది. తనపట్ల ఎస్‌ఐ దురుసుగా వ్యవహరించారని మండలం లోని ఇస్రానాయక్ తండాకు చెందిన వర్త్య జయరాముడు నాయక్ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అవుకు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 13వ తేదీన బైక్‌పై తండా నుంచి కర్నూలుకు వెళుతుండగా అవుకు స్టేషన్ వద్ద ఎస్‌ఐ తనను నిలిపారని, ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే చూపించానని బాధితుడు తెలిపాడు. హెల్మెట్, ఇన్సూరెన్స్ లేనందుకు రూ.2 వేలు ఇవ్వాలని ఎస్‌ఐ తనను డిమాండ్ చేశాడని తెలిపారు. తనకు వేసిన ఫైన్ రూ.1000 మాత్రమే ఇస్తానని చెప్పటంతో ఎస్‌ఐ తనను కులం పేరుతో దూషించాడని, దురుసుగా ప్రవర్తించాడని తెలిపాడు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదని, దీంతో ఒక నెల తర్వాత ఫైన్ చెల్లించి మోటర్ సైకిల్‌ను తీసుకెళ్లానని తెలిపాడు. ఎస్‌ఐ తనపట్ల వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించానని తెలిపాడు.
ఢిల్లీకి వెళ్లిన ఎస్‌ఐ?
అవుకు మండలం చెర్లోపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ అనే వ్యక్తి తనను ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి వేధిస్తున్నారని భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది.