కోర్టులో సలాం అత్త వాంగ్మూలం

ABN , First Publish Date - 2020-11-25T05:42:24+05:30 IST

నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య గురించి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆళ్లగడ్డ జూనియర్‌ సివిల్‌ జడ్జి శైలజ ముందు సలాం అత్త మహబూబ్‌ ఉని మంగళవారం హాజరయ్యారు.

కోర్టులో సలాం అత్త వాంగ్మూలం

ఆళ్లగడ్డ, నవంబరు 24: నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య గురించి వాంగ్మూలం ఇచ్చేందుకు ఆళ్లగడ్డ జూనియర్‌ సివిల్‌ జడ్జి శైలజ ముందు సలాం అత్త మహబూబ్‌ ఉని మంగళవారం హాజరయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు 164 సెక్షన్‌ కింద వివరించేందుకు ఆమె వచ్చారు. సలాం కుటుంబ సభ్యులు సమాజంలో ఎంతో గౌరవంగా జీవిస్తుండే వారని, వారి పట్ల పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు వ్యవహరించిన ప్రవర్తనతో వారు ఆత్మహత్య చేసుకున్నారని వివరించినట్లు తెలిసింది. నంద్యాల కోర్టులో వివరించేందుకు అవకాశం లేని కారణంగా ఇక్కడకు హాజరైనట్లు తెలిసింది. సలాం అత్త వాంగ్మూలాన్ని నమోదు చేసి జిల్లా న్యాయస్థానానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి శైలజ సీల్డు కవరులో నివేదించనున్నట్లు తెలిసింది.


పోలీసుల బెయిల్‌ రద్దు విచారణ నేటికి వాయిదా

నంద్యాల (నూనెపల్లె): అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ బెయిల్‌ రద్దు విచారణ బుధవారానికి వాయిదా పడింది. సోమవారం వాదన, ప్రతివాదనలపై బెయిల్‌ రద్దు విచారణ మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన విచారణలో అబ్దుల్‌ సలాం కుటుంబం తరపున ఏపీ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. అనంతరం నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి సువర్ణరాజు తెలిపారు.

Read more