ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-12-21T05:27:48+05:30 IST

నగరంలోని కొండారెడ్డిబురుజు సమీపంలో పార్కింగ్‌ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌ల తొలగింపునకు రంగం సిద్ధమైంది.

ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం
కమిషనర్‌తో చర్చిస్తున్న ఎంపీ సంజీవ్‌కుమార్‌

  1.  ఎంపీ, ఎమ్మెల్యేను ఆశ్రయించిన ఆక్రమణదారులు
  2.  ముగిసిన నోటీసుల గడువు 


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 20:  నగరంలోని కొండారెడ్డిబురుజు సమీపంలో పార్కింగ్‌ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌ల తొలగింపునకు రంగం సిద్ధమైంది. గత రెండు నెలలుగా ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారంతో ముగిసింది. బిల్డింగ్‌లను కూల్చేస్తున్నామంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆక్రమణదారులు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌లను ఆశ్రయించి కూల్చివేతలను ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంజీవ్‌కుమార్‌ శనివారం  కమిషనర్‌తో తొలగింపుల విషయమై చర్చించారు. ఎమ్మెల్యే కూడా నగర పాలక సంస్థ కమిషనర్‌తో కూల్చివేతపై ఆచి తూచి స్పందించాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం  అక్రమ నిర్మా ణాలను కూల్చివేస్తామంటూ నగర పాలక సంస్థ అధికారుల సూచనలతో కొందరు ఆక్రమణదారులు బిల్డింగ్‌ల్లోని సామగ్రిని బయటకు తరలించుకున్నారు. మరికొందరు   బిల్డింగ్‌లు  ఖాళీ చేయకుండా మొండికేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా సంబంధిత  శాఖల అధికారుల సహాయాన్ని కమిషనర్‌ కోరారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లే రహదారిలోని శ్రీనివాస క్లాత్‌ మార్కెట్‌లో ఉన్న రెండు ఫ్లాట్లు, షరా్‌ఫబజార్‌లో 8 బిల్డింగ్‌లను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. షరా్‌ఫబజార్‌లోని మరో 53 షాపులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతలకు ముందస్తుగా టౌన్‌ అండ్‌ కంట్రీ రాష్ట్ర డైరెక్టర్‌ రాముడుకు ముందస్తుగా కమిషనర్‌ లేఖ రాశారు. డైరెక్టర్‌ కార్యాలయం నుంచి అందిన సూచనల మేరకు అక్రమ నిర్మాణాల ఓ ప్రణాళిక ప్రకారం  తొలగించే ప్రక్రియను చేపట్టారు. సోమవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అవసరమైన చర్యలు తీసుకున్నామని నగర పాలక సంస్థ డీసీపీ కోటయ్య తెలిపారు.  

Updated Date - 2020-12-21T05:27:48+05:30 IST