ప్రమాద ఘంటిక

ABN , First Publish Date - 2020-04-14T10:48:41+05:30 IST

జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

ప్రమాద ఘంటిక

రెడ్‌ జోన్లలో జన సంచారం

యథేచ్ఛగా ఉల్లంఘనలు

వీధుల్లో కనిపించని పోలీసులు

జిల్లాలో 84 పాజిటివ్‌ కేసులు

39కి చేరిన రెడ్‌ జోన్ల సంఖ్య

అదనపు బలగాలు వచ్చేదెన్నడు..?


కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 13: జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసరాల కోసం కూడా గడప దాటకూడదు. కావాల్సిన సరుకులను ఇళ్లకే చేరవేస్తారు. కానీ జిల్లాలోని రెడ్‌ జోన్‌ ఏరియా వీధుల్లోనూ జన సంచారం కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫలితం దారుణంగా ఉంటుంది. జిల్లాలో గత శుక్రవారం 21 ప్రాంతాలను అధికారులు రెడ్‌ జోన్లుగా ప్రకటించారు.ఈ జాబితాలోకి  సోమవారం మరో 18 ప్రాంతాలు చేరాయి. దీంతో జిల్లాలో రెడ్‌ జోన్ల సంఖ్య 39కి చేరింది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసులు మేల్కొనకపోతే పరిస్థితి చేజారక మానదు. రెడ్‌ జోన్‌ ఏరియాలో ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు ప్రత్యేక బలగాలను పంపుతామని డీఐజీ ప్రకటించారు. కానీ బలగాలు ఇంకా రాలేదు. 


అడిగేది ఎవరు..?

జిల్లా కేంద్రంలోని రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లోనే పలువురు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించడం లేదు. యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారు. రెడ్‌ జోన్లలోని ప్రధాన రహదారుల్లో మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి సుంకేసుల ప్రధాన రహదారి, కాలనీల వెంట కంచె వేసి దారులు మూసివేశారు. కానీ తుంగభద్ర నది వెంట రహదారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. బెంగుళూరు-హైదరాబాద్‌ హైవే నుంచి నగరంలోని రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లోకి ఈ మార్గంలోనే వస్తున్నారు. వీరిని అడ్డుకునేవారు లేరు. పాతబస్తీ, బుధవారపేట, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, గణేష్‌ నగర్‌ ప్రాంతాల్లో కూడా ప్రజలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారు. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 


ఎగబడుతూనే..

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఔషధాలు, కిరాణం, కూరగాయల దుకాణాల వద్ద భౌతిక దూరం అమలు కావడం లేదు. దుకాణదారులకు వ్యాపారం తప్ప రద్దీ నియంత్రణ పట్టడం లేదు. పోలీసులు ఆంక్షలు పెట్టారు కదా అని చాక్‌ పీసుతో గడులు గీసి మమ అనిపిస్తున్నారు. సి క్యాంప్‌ నుంచి రైతు బజారును తరలించారు. బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు వరకు రోడ్ల వెంట కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతంలో కూడా ప్రజలు తోసుకుంటున్నారు. సాధారణ రోజుల తరహాలోనే పరిస్థితి కనిపిస్తోంది. మార్పు ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. 


రోడ్లపై ఏం పని..?

లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చాక ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిత్యావసరాలు కొనే వెసులుబాటు కల్పించారు. ఆ సమయంలో ప్రశ్నిస్తే అదే సాకు చెబుతున్నారు. కానీ ఆ తరువాత కూడా రోడ్లపై వాహనాలు కనిపిస్తున్నాయి. వీధుల్లో గుంపులు కడుతున్నారు. స్వీయ నియంత్రణ పాటించడం లేదు. ఇలాంటి వారిని పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకూ రోడ్లపై ఏ ఒక్కరూ తిరగకూడదని ఆంక్షలు ఉన్నాయి. కానీ అమలు కావడం లేదు. పోలీసులు మరింత క ఠినంగా వ్యవహరించాలని పలువులు అభిప్రాయపడుతున్నారు.


 అదనపు బలగాలను పంపిస్తారా?

 కరోనా తీవ్రంగా ఉన్న ఆరు జిల్లాలకు ప్రత్యేక బలగాలను పంపుతామని డీజీపీ ప్రకటించారు. వారిని ఉపయోగించుకుని రెడ్‌ జోన్ల పరిధిలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. జాబితాలో జిల్లా ఉంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న గ్రీన్‌ జోన్‌ నుంచి బలగాలను రెడ్‌, ఆరెంజ్‌ నోన్లకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను డీఐజీలు, శాంతి భద్రతల విభాగం అధికారులకు అప్పగించారు. గ్రీన్‌ జోన్ల నుంచి రెడ్‌ జోన్లకు అదనపు సిబ్బంది వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.


జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో పాజిటివ్‌ కేసులు 84 చేరాయి. ఇందులో 21 కేసులు ఒక్క కర్నూలు నగరంలోనే ఉన్నాయి. గని గల్లీలో ఏకంగా ఆరుగురికి కరోనా సోకింది. 19 పాజిటివ్‌ కేసులతో తరువాతి స్థానంలో నంద్యాల నిలిచింది. పాణ్యంలో ఏడుగురికి కరోనా సోకగా, ఒకరు మృతిచెందారు. మృతుడి కుటుంబంలో మరో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. 


రెడ్‌ జోన్లు ఇవే..

కర్నూలు నగరంలోని రోజా వీధి, బుధవారపేట, చిత్తారి వీధి, గఫార్‌ వీధి, గని గల్లీ, జిందాబాయ్‌ మజీద్‌, ఖడక్‌పుర, కేవీఆర్‌ గార్డెన్‌, నాగప్ప వీధి, ప్రకాష్‌ నగర్‌, రెవెన్యూ కాలనీ, శ్రీలక్ష్మి నగర్‌, ఎన్‌ఆర్‌ పేట, పార్కు రోడ్డు

కర్నూలు రూరల్‌లో పడిదెంపాడు గ్రామం.

నంద్యాల పట్టణంలో నీలి వీధి, మౌలానా పేట, మదార్‌ పేట, గుడిపాటి గడ్డ, దేవనగర్‌, చాంద్‌బాడ, ఆత్మకూరు బస్టాండ్‌, అయ్యలూరు, ముల్లన్‌ పేట

గోస్పాడు మండలం నూనెపల్లె

ఆత్మకూరులోని ఇస్లామ్‌ పేట, కిషన్‌ సింగ్‌ వీధి

నందికొట్కూరు పట్టణం, మల్యాల గ్రామం, సంగయ్య పేట

పాణ్యం షాలి సాహెబ్‌ వీధి, ఎస్‌ఆర్‌బీసీ కాలనీ

బేతంచెర్లలోని కొత్త బస్టాండ్‌, తిమ్మాపురం(గ్రామం),

బనగానపల్లెలోని కొండ పేట, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌

గడవేములు మండలం బిలకలగూడురు

కోడుమూరులోని 18వ వార్డు, మోమిన్‌ స్ట్రీట్‌

నందవరంలోని చాకలి వీధి, గోస్పాడ్‌లోని నూనెపల్లె గ్రామం

రుద్రవరం మండలంలోని గోనంపల్లె గ్రామం

సంజామల మండలంలోని నోస్సం గ్రామం. 

అవుకు పట్టణంలోని ముస్లిం వీధి

Updated Date - 2020-04-14T10:48:41+05:30 IST