ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నాశనం చేయడం దుర్మార్గం

ABN , First Publish Date - 2020-12-16T05:15:07+05:30 IST

వ్యవసాయ రంగ అభివృద్ధిలో, కొత్త వంగడాల తయారీలో దేశ వ్యాప్త గుర్తింపు ఉన్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం నాశనం చేయాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నాశనం చేయడం దుర్మార్గం
దీక్షకు సంఘీభావం తెలుపుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి

  1. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి  
  2. రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు


నంద్యాల, డిసెంబరు 15: వ్యవసాయ రంగ అభివృద్ధిలో, కొత్త వంగడాల తయారీలో దేశ వ్యాప్త గుర్తింపు ఉన్న  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం నాశనం చేయాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు ప్రారంభించారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ స్పందించకపోతుండటంతో 21వతేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు వెల్లడించారు. మొదటి రోజు దీక్షకు మాజీ ఎమ్మెల్యే హాజరై సంఘీభావం తెలిపి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుపడిందని, అధికార పార్టీ నాయకుల కోసమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. నంద్యాలలో వైద్య కళాశాలను పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కేటాయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు కోసం అవసరమయ్యే భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కాపాడుకునే పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని భూమా బ్రహ్మానందరెడ్డి దీక్షా సభలో ప్రకటించారు.


ఎంపీ, ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతాం: ప్రజా సంఘాల నాయకులు

నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిల ధన దాహానికి, వారి ఆస్తుల ధరలు పెంచుకోవడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని ఇక్కడి నుంచి తరలించే కుట్రకు తెరలేపారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. రిలే నిరాహార దీక్షలో సీఐటీయూ మహమ్మద్‌ గౌస్‌, సీపీఎం తోట మద్దులు, సీపీఐ బాబాఫకృద్దీన్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి, ఐయుఎంఎల్‌ సలాం మౌలానా, ముస్లిం మైనార్టీ ఫోరం మహాబూబ్‌బాషా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కాపాడుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:15:07+05:30 IST