మొక్కజొన్నకు వానపోటు

ABN , First Publish Date - 2020-10-21T11:35:10+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ వరదల్లో కొట్టుకుని పోయాయి

మొక్కజొన్నకు వానపోటు

జిల్లాలో రూ.97.50 కోట్ల నష్టం 

ఎకరాకు 30 క్వింటాళ్లు తగ్గిన దిగుబడి 

కొనుగోలు కేంద్రాల్లో 30 శాతానికే అవకాశం 

వాయిదా పడ్డ మొక్కజొన్న కొనుగోలు 


రుద్రవరం, అక్టోబరు 20: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ వరదల్లో కొట్టుకుని పోయాయి. జిల్లాలో 75 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టారు. సగటున ఎకరాకు 30 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా 10 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. 


మొలకలు వచ్చిన మొక్కజొన్నలు

కోత కోసిన మొక్కజొన్న వర్షాలకు తడిసి మొలకెత్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్నలు బూజు వచ్చాయి. ఎకరాకు 10 మూటల చొప్పున దిగుబడి తగ్గిపోవడంతో 75వేల ఎకరాలకు రూ.97.50 కోట్లు నష్టపోయారని చెబుతున్నారు. ఎకరా కోత కోయడానికి టైర్‌ మిషన్‌కు రూ.2 వేలు, ఒక గంటకు చైన్‌ మిషన్‌కు రూ.3 వేలు చెల్లిస్తున్నామని రైతులు వాపోయారు. 


30 శాతమే కొనుగోలుచేస్తే ఎలా?

ప్రభుత్వం మొక్కజొన్నలు కొనుగోలు చేయాలంటే ఈ-క్రాప్‌ తప్పనిసరిగా చేసి ఉండాలి. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారిలో కూడా 30 శాతం మందివి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరో 70 శాతం మొక్కజొన్న పంట సాగు చేసిన రైతుల మాటేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-క్రాప్‌ నమోదు చేసుకోకుండా ఉన్న రైతులు విక్రయించేందుకు వెళ్తే క్వింటం రూ.1,300 ధర పలుకుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మాత్రం రూ.1,850 ధర నిర్ణయించింది. రైతులు సంతోషపడ్డారు కానీ కొనుగోలు కేంద్రాల్లో 70 శాతం మంది రైతుల పంట కొనకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. 


తరుగు పేరుతో వ్యాపారుల కోత.. 

మొక్కజొన్న పంట కొనుగోలు చేసే వ్యాపారులు తరుగు పేరుతో క్వింటానికి 4 కిలోల కోత విధిస్తున్నారు. ఇందులో దేవుడు గింజలని, మరికొన్ని ముగ్గు అని వేయించుకుంటున్నారు. ఇలా ప్రతి క్వింటాకు రైతులు నాలుగైదు కిలోలు నష్టపోవాల్సి వస్తోంది. 


కొంప ముంచిన వాన: దస్తగిరి, రైతు, రుద్రవరం 

ప్రకృతి కొంప ముంచింది. మొక్కజొన్న కోత కోయకుండానే ఐదున్నర ఎకరాల్లో అలాగే ఉంచా. చేతికి వస్తుందో లేదో. 


రూ.30 వేలు నష్టపోయా: దస్తగిరి, రైతు, వెలగలపల్లె 

రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసి రూ.30 వేలు నష్టపోయా. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. 


ఆశతో సాగు చేస్తే..: రాజు, రైతు, కొండమాయపల్లె 

వర్షాల వల్ల మొక్కజొన్న దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్లు తగ్గింది. కోత కోసిన మొక్కజొన్నలు బూజు వచ్చాయి. 


మొక్కజొన్నల కొనుగోలు వాయిదా పడింది: ప్రసాద్‌రావు, ఏవో, రుద్రవరం 

మొక్కజొన్నల కొనుగోలు 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేసింది. 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు పొడిగించింది. రుద్రవరం మండలంలో 6 కేంద్రాల్లో మొక్కజొన్నలు కొనుగోలు చేస్తాం. ఈ కొనుగోలు పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 

Updated Date - 2020-10-21T11:35:10+05:30 IST