పుష్కర మాయ

ABN , First Publish Date - 2020-11-25T06:27:01+05:30 IST

తుంగభద్ర పుష్కరాల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు.

పుష్కర మాయ
పుష్కర ఘాట్‌ వద్ద పనులు చేస్తున్న కార్మికులు

  1. ఘాట్లలో కార్మికుల శ్రమ దోపిడీ
  2.  ఉదయం నుంచి రాత్రి వరకూ విధులు
  3.  ఒక్కో ఘాట్‌కు 30 మంది కేటాయింపు
  4. విధుల్లో ఉంటున్నది 20 మందే..
  5. వాటర్‌ ప్యాకెట్లపై కనిపించని తయారీ తేదీ


కర్నూలు, ఆంధ్రజ్యోతి: తుంగభద్ర పుష్కరాల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా పారిశుధ్య కార్మికులపై పని భారం పడుతోంది. ఒక్కో ఘాట్‌లో 44 మంది చేయాల్సిన పనిని 20 మందితో చేయిస్తున్నారు. రోజుకు సగటున 14 గంటలు పని చేయిస్తున్నారు. పుష్కర పనులతో తమకు ఉపాధి లభిస్తుందనుకున్న కార్మికులు పని ఒత్తిడితో నీరసించిపోతున్నారు. నగరపాలక సంస్థ రికార్డుల్లో మాత్రం 44 మంది పనిచేస్తున్నట్లు నమోదు చేస్తున్నారు. రూ.44 లక్షలకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరును నగరపాలక సంస్థ అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదు. భక్తులకు 14 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, వాటర్‌ ప్యాకెట్లతో సరిపెడుతున్నారు. పుష్కరాలకు భక్తులు రావడంలేదు.. ఇంకెవరు అడుగుతారు.. అన్న ధీమాతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 


సగం కార్మికులు.. రెట్టింపు పని

తుంగభద్ర పుష్కరాలలో పుష్కర ఘాట్ల, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు కర్నూలు నగరపాలక సంస్థ, ఎమ్మిగనూరు మునిసిపాలిటీకి ప్రభుత్వం రూ.30 కోట్లను కేటాయించింది. కర్నూలు, కర్నూలు రూరల్‌ పరిధిలో ఉన్న పుష్కర ఘాట్లలో పారిశుధ్య నిర్వహణకు 400 మందిని తాత్కాలిక కార్మికులుగా (నగర పాలకలో పనిచేస్తున్న 1090 కార్మికులు కాకుండా) నియమించుకున్నారు. కర్నూలు పరిధిలోని 8 ఘాట్లు ఉన్నాయి. ఒక్కో ఘాట్‌లో పారిశుధ్య నిర్వహణకు, ఇతర అవసరాలకు షిఫ్టునకు 10 మంది ప్రకారం 30 మంది కావాలని ఇంజనీరింగ్‌ విభాగం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండరును రూ.44 లక్షలకు ఓ ఏజెన్సీ సొంతం చేసుకుంది. ఉదయం 22 మంది, మధ్యాహ్నం 22 మంది విధుల్లో ఉండేలా నగరపాలక హెల్త్‌ విభాగం కేటాయించింది. ఒక్కొక్కరికి రోజుకు రూ.450 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. కార్మికులతో పని చేయించుకునే బాధ్యతను శానిటరీ సెక్రటరీలకు అప్పగించారు. వారే పనులను పర్యవేక్షిస్తూ హాజరు తీసుకుంటున్నారు. హాజరు 40 మందికి వేస్తున్నా.. విధుల్లో 20 మందే కనిపిస్తున్నారు. ఉదయం పనిచేస్తున్న వారితోనే మధ్యా హ్నం షిఫ్టులోనూ పనిచేయిస్తున్నారు. ఆ లెక్కన రెండు విధులు నిర్వర్తించినందుకు రెట్టింపు కూలి రూ.900 ఇవ్వాలి. కానీ రూ.500 మాత్రమే ఇస్తామని కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఒకరే పని చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పనిభారంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదే పదే బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్న కార్మికుల చేతులు బొబ్బలు కడుతున్నాయి. 


భక్తులు రాకపోవడం కలిసొచ్చింది..

పుష్కరాలు 20వ తేదీ నుంచి ప్రారంభమైనా, రెండ్రోజుల ముందుగానే కార్మికులను అధికారులు రంగంలోకి దింపారు. ఘాట్‌ శుభ్రత, చెత్త, వ్యర్థాలు తొలగించే పనులను అప్పగించారు. ఐదు రోజులుగా ఘాట్లకు భక్తులు రాకపోవడంతో పెద్దగా పనులు చేయాల్సిన అవసరం రాలేదు. ఉన్న కొద్ది మంది కాస్త చెత్తను ఊడ్చేస్తున్నారు. ఒక్కో ఘాట్‌కు భక్తులు వేలాదిగా వచ్చుంటే అసలు విషయం వెలుగులోకి వచ్చేది. భక్తులు ఘాట్లకు రాకపోయినా ఒప్పందం ప్రకారం రూ.44 లక్షలను కార్పొరేషన్‌ అధికారులు చెల్లించాల్సిందే. తప్పు చేస్తే సహించబోనని హెచ్చరించిన నగరపాలక కమిషనర్‌ డీకే బాలాజీ, ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 


నీటి పేరిట దోపిడీ

 ఘాట్లలో వందల బస్తాల్లో వాటర్‌ ప్యాకెట్లు ఉంచి భక్తులకు ఇస్తున్నారు. వీటిపై తయారీ తేదీని ముద్రించలేదు. ‘ప్యాకింగ్‌ తేదీ తర్వాత 21 రోజుల్లోగా వాడాలి’ అన్న వాక్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తేదీ లేని ప్యాకెట్లను భక్తులకు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. పుష్కర పనుల టెండర్లు కొందరు వైసీపీ నాయకులకు ఖరారైనట్లుగా సమాచారం. నగరంలోని 8 ఘాట్లకు సంబంధించి రూ.50 లక్షలకు టెండర్లను ఆహ్వానించారు. 10 శాతం తక్కువతో రూ.40 లక్షలకు దక్కించుకున్నారు. ఒక్కో ఘాట్లో 2 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను ఏర్పాటు చేయాలి. కానీ ఇంత వరకు ట్యాంకులు ఏర్పాటుచేయలేదు. మూడు రోజులుగా వాటర్‌ ప్యాకెట్‌ బస్తాలను సరఫరా చేస్తున్నారు. ఘాట్లలో  శనివారం జనాల్లేకపోయినా ఒక్కో ఘాట్‌కు 2 వేల లీటర్లు సరఫరా చేశామని రికార్డులు నమోదు చేశారు. జనం కొద్దిగా పెరిగిన ఆదివారం కూడా 2 వేల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఈ తరహా వాటర్‌ ప్యాకెట్లను తనిఖీ చేశాకే భక్తులకు పంపిణీ చేయాలి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర శాఖల అధికారులు మాత్రం బ్రాండెడ్‌ వాటర్‌ బాటిళ్లు తెప్పించుకుంటున్నారు.

Read more