-
-
Home » Andhra Pradesh » Kurnool » prepare for re survey
-
భూముల రీ సర్వేకి సిద్ధంకండి
ABN , First Publish Date - 2020-12-10T05:56:27+05:30 IST
భూములన్నీంటిని రీ సర్వే చేసేందుకు సమాయత్తం కావాలని కలెక్టర్ వీరపాండియన్ అధికా రులను ఆదేశించారు.

- అధికారులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అర్బన్), డిసెంబరు 9: భూములన్నీంటిని రీ సర్వే చేసేందుకు సమాయత్తం కావాలని కలెక్టర్ వీరపాండియన్ అధికా రులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ ఆధికారులు, ల్యాండ్ అండ్ సర్వే అధికారు లతో బుధవారం సమావేశం నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల సమగ్ర రీ సర్వే చేసి, రికార్డులో నమోదు చేయాలని ఆదేశిం చారు. డేటాని సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు.
54 మండలాల్లో ఎంపిక చేసిన 54 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రీ సర్వే చేయాలని ఆదేశించారు. దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వేయర్లకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని, ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించి భూముల సమగ్ర సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇద్దురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించి డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని డీఆర్వో పుల్లయ్య, నంద్యాల సబ్ కలెక్టర్, కర్నూలు, ఆదోని ఆర్డీవోలను ఆదేశించారు. ప్రతి మండలంలో ఒక్క డ్రోన్ టీమ్, డేటా ప్రాసెసింగ్, రీ సర్వే టీమ్ ఏర్పాటు చేసుకొని సర్వే జరపాలన్నారు. గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం భూముల మార్కింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సేకరణ భూములు ఉన్న మండలాలను మొదటగా తీసుకుంటే త్వరగా సర్వే పూర్తి అవుతుందని తెలిపారు.
ఇళ్ల పట్టాల పంపిణికి ఏర్పాట్లు చేసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న 133 కేసులకు కౌంటర్ ఫైలు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ భూములను కూడా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 25న మొదటి విడతగా 98,388 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని, ఆదే రోజున ఇళ్ల నిర్మాణానికి భూమి పూజకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా సరఫరా చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ రామసుందరరెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారీ, డీఆర్వో పుల్లయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.