పుష్కర ప్రణాళికలు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2020-06-18T10:28:59+05:30 IST
తంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్

అధికారులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): తంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిధిలో మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సాధారణ పరిస్థితుల తరహాలో అధిక సంఖ్యలో ప్రజలు వస్తే మొదటి ప్రణాళిక, కొవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించేలా రెండో ప్రణాళిక, యాత్రికులు లేకుండా సంప్రదాయంగా పుష్కర ఏర్పాట్లపై మూడో ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. వారం రోజుల్గో నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాల కోసం పారిశుధ్యం, ఫాగింగ్, ఆరోగ్యం, విద్యుత్, పౌర సరఫరాలు, వసతులు, ప్రొటోకాల్, నీటీ సరఫరా, బందోబస్తు, ట్రాఫిక్ కంట్రోల్ వంటి 14 రకాల కమిటీలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీలతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రతిపాదనలను సంబంధిత శాఖల ప్రధాన కార్యాలయాలకు కూడా పంపించాలని ఆదేశించారు. గత పుష్కర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు.
జిల్లాలో తుంగభద్ర తీరాన మంత్రాలయం నుంచి కర్నూలు, కొత్తపల్లి సంగమేశ్వర ఆలయం ఘాట్ వరకు మొత్తం 15 పుష్కర ఘాట్లు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ఏఏ ఏర్పాట్లు చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆహారం, రవాణా కమిటీలను అదనంగా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీకి సూచించారు. సమావేశంలో ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్ శెట్టి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ నిధి మీనా, డీఆర్వో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.