అనుమానం రావడంతో..

ABN , First Publish Date - 2020-12-27T06:05:57+05:30 IST

మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన అక్కెం స్వాములు అలియాస్‌ వెంకటరమణ నవంబరు 29న మృతి చెందాడు.

అనుమానం రావడంతో..

  1.  మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం


ఓర్వకల్లు, డిసెంబరు 26: మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన అక్కెం స్వాములు అలియాస్‌ వెంకటరమణ నవంబరు 29న మృతి చెందాడు. 30న తల్లి రాములమ్మ, భార్య పరమేశ్వరి బంధువులు, కుటుంబ సభ్యులు ఎస్సీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే దళిత సంఘాలు, వీఆర్వో నాగరాజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పూడ్చిన మృతదేహాన్ని శనివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నవంబరు 29న రాత్రి హైవే సమీపంలో వెంకటరమణ చనిపోయారని వీఆర్వో ఫిర్యాదు చేశారు. వెంకటరమణ మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు లేవనెత్తలేదు. గ్రామంలో గత రెండు మూడు రోజులుగా వెంకటరమణ మృతిపై పలు అనుమానాలు వస్తున్నాయని, ఆయన మృతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిసెంబరు 24న వీఆర్వో ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘాలు నాయకులు, డీజీపీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు కూడా ఫిర్యాదు చేశారు. వెంకటరమణ మృతిపై తమకు పలు అనుమానాలు వున్నాయని, స్థానిక నాయకులే హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌, తహసీల్దార్‌ శివరాముడు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, వీఆర్వో నాగరాజు సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌ పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2020-12-27T06:05:57+05:30 IST