ఎప్పుడొస్తావ్‌ అతిథీ..?

ABN , First Publish Date - 2020-07-14T10:56:41+05:30 IST

‘రెండు మసాలా దోషేయ్‌...’, ‘ఆ...నాలుగు పూరీ పార్సీల్‌...’, ‘సార్‌...మీరు చెప్పిన షుగర్‌ లెస్‌ టీ తీస్కోండి..

ఎప్పుడొస్తావ్‌ అతిథీ..?

కొవిడ్‌ భయంతో హోటళ్లకు వెళ్లని జనం

సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం

జిల్లాలో వేలాది మంది ఉపాధికి గండి

ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపుకర్నూలు (కల్చరల్‌), జూలై 7:  ‘రెండు మసాలా దోషేయ్‌...’, ‘ఆ...నాలుగు పూరీ పార్సీల్‌...’, ‘సార్‌...మీరు చెప్పిన షుగర్‌ లెస్‌ టీ తీస్కోండి...’ ఇదీ లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలోని టిఫిన్‌ హోటళ్లలో సందడి. 


 ‘సర్‌.. భోజనం టోకెన్‌ తీసుకోండి...’ ‘సర్‌ ఫుల్‌ మీల్సా.. ప్లేట్‌ మీల్సా...?’ అప్పుడే వచ్చినవారితో ఓ వైపు మాట్లాడుతూనే.. వేడివేడి అన్నం అరటి ఆకులో వడ్డించేవారు. గిన్నెల్లో నింపిన పప్పు, సాంబారు, కూరలు, చట్నీ గబా గబా వడ్డించేవారు ఇంకొకరు అప్పడాలు అందిస్తూ అటూ ఇటూ హడావుడిగా తిరిగేవారు. అన్ని హోటెళ్లలో సర్వర్ల సందడి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. భోజనం పార్శిళ్లుగా కట్టిపెట్టి కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నారు. 


కరోనా దెబ్బకు జిల్లాలో హోటళ్లు కుదేలైపోయాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిస్థితి  మునిపటిలా లేదు. హోటళ్లలో ఆహార పదార్థాలను కేవలం పార్శిళ్ల వరకే పరిమితం చేశారు. వినియోగదారులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. వండిన పదార్థాలు మిగిలిపోతే నష్టం భరించాలి. ఈ పరిస్థితిలు హోటల్‌ వ్యాపారులను కుంగదీస్తున్నాయి.


బజ్జీల బండ్ల నుంచి..

జిల్లాలో హోటళ్ల రంగం బాగా విస్తరించింది. ఐదు వేలకు పైగా టిఫిన్‌ సెంటర్లు, మూడు వేలకు పైగా భోజనం హోటళ్లు ఉన్నాయి. ఇవి కాక కర్రీ పాయింట్లు, మొబైల్‌ క్యాంటీన్లు మరో పదిహేను వందల వరకు ఉన్నాయి. రద్దీ ప్రదేశాల్లో మిర్చి బజ్జీల బండ్లు, చాట్‌ బండార్లు రెండు వేలకు పైగా ఉన్నాయి. వీరంతా దినసరి వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణ రోజుల్లో లాభాలలో బాటలో నడిచారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. కానీ మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక పరిస్థితి తల్లకిందులైంది. యజమానులకు, సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. సుమారు 75 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌తో హోటళ్ల రంగం కోలుకోలేని దెబ్బ తినింది. బయటి ఆహారం తినొద్దన్న ప్రచారం కారణంగా వ్యాపారాలు జరగడం లేదు.


వేలాది మందికి దారి.. 

జిల్లాలో హోటళ్ల రంగం వేలాది మందికి ఉపాధి మార్గం చూపిస్తోంది. ఇప్పుడు రోడ్డుమీద బడ్డీ కొట్టు నుంచి టూ స్టార్‌ హోటల్‌ వరకూ కరోనా బెడద తప్పడం లేదు. హోటళ్లలో పనిచేసే పారిశుధ్య కార్మికుల నుంచి రూమ్‌ బాయ్‌, వంట మాస్టర్లు, సప్లయర్లు. ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. పరోక్షంగా పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలు, బియ్యం వ్యాపారుల వరకు అందర్నీ దెబ్బతీసింది. 13 రకాల పన్నులు కడుతున్న వీరిపై ఆ వైపు నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. మరికొన్ని చోట్ల అద్దె బకాయిలు చెల్లించాలని భవన యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో హోటెళ్ల నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


అంతటా సంక్షోభం

జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నో ఉన్నాయి. పర్యాటకుల సందడి బాగా ఉండేది. దీంతో హోటళ్ల రంగం పదేళ్లలో శరవేగంగా విస్తరించింది. టూ స్టార్‌ హోటళ్ల నుంచి టూరిస్టు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, స్నాక్స్‌ కార్నర్లు ఆయా ప్రాంతాల్లో వెలిశాయి. కొందరు వంశపార్యంపరగా హోటల్‌ రంగాన్నే నమ్ముకున్నారు. నిరుద్యోగ యువత బ్యాంకు రుణాలను తీసుకుని హోటెల్‌ వ్యాపారాలు ప్రారంభించింది. ఇలాంటి వారి ఆశల సౌధాలను కరోనా మహమ్మారి ఒక్కసారిగా కూల్చివేసింది. 


65 శాతం జరిగితేనే..

హోటల్‌ రంగంలో లాభాలు రావాలంటే రోజుకు 65 శాతం వ్యాపారం జరగాలి. అప్పుడే పన్నులు, భవనం అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 45 శాతం వ్యాపారం కూడా జరగడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. హోటళ్లను నడపడం భారంగా మారిందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ పన్నుల నుంచి విద్యుత్‌ చార్జీలు, సిబ్బంది వేతనాలు, సరుకుల కొనుగోలుకు సరిపడా ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా సిబ్బందికి వదులుకోలేక వారికి వేతనాలు చెల్లిస్తున్నామని అంటున్నారు. మరో ఏడాది వరకు ఇదే దుస్థితి ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


పన్నులు మినహాయించాలి....

హోటళ్ల యజమానులు ప్రభుత్వానికి 13 రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పన్నులు రద్దు చేయాలి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం అప్పుడే కొంత నిలదొక్కుకుంటుంది. కరోనాను అంతర్జాతీయ విపత్తుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తులకు ఇచ్చే మినహాయింపులు కచ్చితంగా ఇవ్వాల్సిందే. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియదు. ప్రభుత్వ సాయం లేకుండా మేము కోలుకోవడం చాలా కష్టం. 

- సముద్రాల హనుమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌


జీతాలు చెల్లిస్తూనే ఉన్నాం...

హోటల్‌ వ్యాపారంలో దినసరి కార్మికులు, ఉద్యోగులు పనుల్లేక రోడ్డున పడుతున్నారు. వారి కుటుంబ పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. అందుకే లాక్‌డౌన్‌లో హోటళ్లు మూసివేసినా వారికి వేతనాలు చెల్లించి ఆదుకున్నాం. హోటళ్లు బాగా నడవాలంటే ప్రయాణాలు పెరగాలి. బస్సులు పూర్తి స్థాయిలో లేవు. అత్యవసరం ఉంటేనే ప్రయాణం చేస్తున్నారు. ప్రజలు కరోనా భయం లేకుండా బయటకు వస్తేనే హోటళ్లు బాగా జరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాం. ఈ కష్టకాలంలో మాకు ప్రభుత్వం అండగా నిలబడాలి. 

- రామకృష్ణ, నగర కార్యదర్శి, ఏపీ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ 

Updated Date - 2020-07-14T10:56:41+05:30 IST