బయటికొచ్చేశారు

ABN , First Publish Date - 2020-05-19T06:58:27+05:30 IST

నాలుగో విడత లాక్‌డౌన్‌పై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఆంక్షలు సడలించారని భావించి సోమవారం

బయటికొచ్చేశారు

నాలుగో విడతపై గందరగోళం

గ్రీన్‌ జోన్ల విషయంలో అస్పష్టత

భారీగా బయటకు వచ్చిన ప్రజలు

రెడ్‌ జోన్లలో తెరుచుకున్న దుకాణాలు


కర్నూలు, మే 18(ఆంధ్రజ్యోతి): నాలుగో విడత లాక్‌డౌన్‌పై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఆంక్షలు సడలించారని భావించి సోమవారం ప్రజలు భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. భౌతిక దూరం, మాస్క్‌లు వంటి కనీస జాగ్రత్తలను పాటించలేదు. గుంపులు గుంపులుగా వచ్చిన జనంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను భారీగా సడలించారని, లాక్‌డౌన్‌ను దాదాపు తొలగించినట్లేనని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న పోస్టుల ప్రభావం నగర ప్రజల్లో తొలిరోజు బాగా కనిపించింది. పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసులు మునుపటిలా చొరవ చూపలేదు. రెడ్‌ జోన్లు, బారికేడ్ల వద్ద ప్రజలు సాధారణ పరిస్థితులు ఉన్నట్లు తిరుగుతున్నా అడ్డుకోలేదు. నగర వీధుల్లో ప్రజలు రాకపోకలు లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితుల్ని గుర్తుచేశాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఆత్మకూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అరకొరగానే బయటకు వచ్చారు. దుకాణాలు కూడా పెద్దగా తెరుచుకోలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉన్నా, ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మాత్రమే తెరిచి ఉంచారు. 


ఏమీ చెప్పనందుకే..

లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంక్షలను భారీగా సడలించింది. నిబంధనల రూపకల్పనను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు సీఎం జగన్‌ నుంచి ఆదివారం సాయంత్రానికే ఆదేశాలు అందాయి. జిల్లాలో పాటించే విధి విధానాలను ఆదివారం రాత్రి కలెక్టర్‌ వీరపాండియన్‌ విడుదల చేశారు. వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతలను ఎస్పీ, డీఎంహెచ్‌వో, కార్పొరేషన్‌, మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు తదితరులకు అప్పగించారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కానీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగర ప్రజలు తొలి రోజు  యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చేశారు. పాత బస్టాండ్‌, గాయత్రి ఎస్టేట్‌, బళ్లారి చౌరస్తా, గౌరీ గోపాల్‌ సర్కిల్‌, పాత బస్తీలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా కనిపించింది. ఆ ప్రాంతాల్లో పోలీసులున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత రెండ్రోజుల కంటే సోమవారమే ఎక్కువగా ద్విచక్ర వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. 


జోన్లపై గందరగోళం

పాజిటివ్‌ కేసుల సంఖ్యల ఆధారంగా జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది. కానీ రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వివరాలను మాత్రమే కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించారు. గ్రీన్‌ జోన్ల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాలో లేని మండలాలను గ్రీన్‌ జోన్లుగా పరిగణించవచ్చని కలెక్టరేట్‌ ఉద్యోగులు కొందరు అనధికారికంగా చెబుతున్నారు. జోన్లపై స్పష్టత లేని కారణంగా రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న దుకాణాలు కూడా కొన్నిచోట్ల సోమవారం తెరుచుకున్నాయి. తమ ప్రాంతం ఏ జోన్‌లో ఉందో తెలియక ప్రజలు దుకాణాల వద్దకు గుంపులుగా వెళుతున్నారు. నంద్యాలకు చెందిన ఓ సీఐ ‘దేవుడి దయ వల్ల మా ప్రాంతం గ్రీన్‌ జోన్లో ఉంది..’ అని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల మండలాలను స్థానిక అధికారులు గ్రీన్‌ జోన్లుగా ప్రకటించారు. అధికారిక వివరాల ప్రకారం సంజామల మండలం ఆరెంజ్‌ జోన్లో ఉంది. జోన్ల విషయంలో అధికారులకే అవగాహన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


తొలి రోజు ఇలా..

బనగానపల్లె నియోజకవర్గంలో హోటళ్లు, సినిమా హాళ్లు తప్ప దాదాపు అన్ని దుకాణాలను సోమవారం తెరిచారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. బనగానపల్లె మండలం రెడ్‌జోన్లో ఉండగా అవుకు మండలం ఆరెంజ్‌ జోన్‌, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలు గ్రీన్‌ జోన్లో ఉన్నాయి. దుకాణాలు, బ్యాంకుల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. బ్యాంకుల వద్ద భౌతిక దూరం కనిపించలేదు. లావాదేవీల కోసం ఖాతాదారులు ఎగబడ్డారు. మాస్క్‌లు ధరించకుండా బైకులపై తిరిగారు. 


నంద్యాలలో సోమవారం ఉదయం భారీ సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు.  నంద్యాల పట్టణం తోపాటు మండలం కూడా రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. భారీగా సడలింపులు ఇచ్చారన్న ప్రచారం కారణంగా జనం మునుపటిలా వ్యవహరించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌, సంజీవనగర్‌, పద్మావతినగర్‌ ఆర్చీ, చామకాలువ, సాయిబాబానగర్‌ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 వరకు ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రధాన రహదారుల్లో భారీగా తిరిగాయి. దుకాణాలు తెరవలేదు. బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించలేదు. కొన్ని చోట్ల బైక్‌లను సీజ్‌ చేశారు. రెడ్‌జోన్‌లో ఉన్న పాణ్యంలో సగానికి పైగా దుకాణాలను తెరిచారు. 


ఆదోని నియోజకవర్గంలో రెడ్‌, గ్రీన్‌ జోన్ల అధికారుల మధ్య సమన్వయం కనిపించలేదు. ఆదోని పట్టణంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచారు. గ్రీన్‌ జోన్‌ అయిన ఆలూరు, హొళగుంద, హాలహర్వి తదితర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక్క దుకాణం తెరిచినా జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తుండడంతో అన్నీ మూతబడ్డాయి. విత్తనాలు, ఎరువుల దుకాణాలు మూతపడటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం అయ్యేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. 


రెడ్‌ జోన్లు

కర్నూలు కార్పొరేషన్‌, నంద్యాల, నందికొట్కూరు, ఆదోని, ఆత్మకూరు మున్సిపాలిటీలు.

కోడుమూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, చాగలమర్రి మండలాలు.


ఆరెంజ్‌ జోన్లు

మున్సిపాలిటీలు: బేతంచర్ల, డోన్‌, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు

మండలాలు: పాములపాడు, చిప్పగిరి, శిరివెళ్ల, గడివేముల, కోసిగి, కర్నూలు, మహానంది, అవుకు, ఆదోని రూరల్‌, ఆస్పరి, బండి ఆత్మకూరు, గోనెగండ్ల, కల్లూరు, కౌతాళం, కృష్ణగిరి, నందికొట్కూరు, ఓర్వకల్లు, పగిడ్యాల, ప్యాపిలి, రుద్రవరం, సంజామల, తుగ్గలి. 


గ్రీన్‌ జోన్లు:

రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌ జాబితాలో లేని ప్రాంతాలు గ్రీన్‌ జోన్‌లు అని అనధికారిక ప్రకటన 


మార్గదర్శకాలు

  • కంటైన్‌మెంట్‌ జోన్లు, బఫర్‌ జోన్లలోదుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదు.
  • ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచొచ్చు.
  • ఔషధ దుకాణాలు తెరిచేందుకు గతంలో మాదిరే అనుమతి ఇచ్చారు.
  • పండ్లు, కూరగాయలు, పాలు విక్రయించే దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి.
  • షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌ కాంప్లెక్సులు, ఇతర మార్కెట్లు ఎక్కడా తెరువకూడదు.
  • గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కాలనీలు, నివాస ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చు.
  • పుస్తకాలు, దుస్తులు, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలకు అనుమతి లేదు.
  • అర్బన్‌ ప్రాంతాల్లోని చిన్న చిన్న కాలనీలు, నివాస ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చు. 
  • ఒకే ప్రాంతంలో ఎక్కువ దుకాణాలు ఉంటే మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతితో సరి, బేసి విధానంలో రోజు విడిచి రోజు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి పొందాలి.
  • ఎక్కువ కరోనా కేసులు ఉన్న మున్సిపల్‌ ప్రాంతాల్లో కలెక్టర్‌ ప్రత్యేక అనుమతితో నిర్మాణ రంగానికి అవసరమైన సామగ్రి దుకాణాలు, వ్యవసాయ పనుల కోసం విత్తన దుకాణాలు, పంపుసెట్ల దుకాణాలు, స్పేర్‌ పార్ట్‌ దుకాణాలు తెరుచుకోవచ్చు.
  • ప్రతి దుకాణంలో సిబ్బంది మాస్కు ధరించాలి. శానిటైజర్‌ వినియోగించాలి. వినియోగదారులు కూడా మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలి.
  • ప్రతి దుకాణం ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌ తప్పక ఏర్పాటు చేయాలి.

Updated Date - 2020-05-19T06:58:27+05:30 IST