అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మంత్రి అనిల్
ABN , First Publish Date - 2020-02-08T11:19:40+05:30 IST
అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పని చేయాలని

- ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పని చేయాలి
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
నంద్యాల, ఫిబ్రవరి 7: అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పని చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నంద్యాల పురపాలక శాఖ సమావేశ భవనంలో వైఎ్‌సఆర్ భరోసా పింఛన్, పేదలందరికి ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై కలెక్టర్ వీరపాండియన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజమైన లబ్ధిదారులందరికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పింఛన్ రద్దు చేసి ఉంటే రీ వెరిఫికేషన్ చేసి అర్హత ఉంటే ఫిబ్రవరి, మార్చి పింఛన్ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దివ్యాంగులకు తాత్కాలిక ధ్రువీకరణ కాకుండా శాశ్వత ప్రాతిపదికన ధ్రువీకరణ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అర్హులందరికి ఉగాది నాటికి ఇంటి పట్టాల పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ రానివారు అధైర్యపడవద్దని, అర్హులందరికీ పింఛన్ వస్తుందని చెప్పారు. వలంటీర్లు ఇంటింటికి వెళ్ళి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ త్వరగా చూడాలని అదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఆర్థర్, జాయింట్ కలెక్టర్ రవి, జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.