పెండింగ్‌లో రీయింబర్స్‌మెంట్‌

ABN , First Publish Date - 2020-06-06T09:20:34+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉద్యోగులు, పింఛన్‌దారుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌

పెండింగ్‌లో రీయింబర్స్‌మెంట్‌

పెద్దాసుపత్రిలో వందలాది బిల్లులు

సంతకాలు చేయని అధికారులు

 క్లర్క్‌తో వాదనకు దిగిన ఉద్యోగి

 

 కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 5: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉద్యోగులు, పింఛన్‌దారుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు ఇవ్వడం లేదు. అనారోగ్యంతో ఆపరేషన్‌ చేయించుకున్న ఉద్యోగులు, పింఛన్‌దారులు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అయినా ఆసుపత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు 600 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. గత మార్చి నుంచి ఒక్క మెడికల్‌ బిల్లు కూడా ఆమోదానికి నోచుకోలేదు. శుక్రవారం ఆసుపత్రిలోని ఇలాంటి బిల్లు విషయంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. 


జరిగింది ఇదీ..

నెలల తరబడి రీయింబర్స్‌మెంట్‌ బిల్లు పెండింగ్‌లో ఉందని ఓ ఉద్యోగి శుక్రవారం ఉదయం పరిపాలన విభాగంలోని క్లర్క్‌ను నిలదీశారు. కరోనా పేరుతో బిల్లులు చెల్లించకపోతే ఎలా అని నిలదీశారు. బిల్లులు మంజూరు చేయించేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని క్లర్క్‌తో అన్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాదన పెరిగి తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు శాంతింపజేసి బిల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో పరిస్థితి సర్దుబాటైంది. 


గత అధికారి వల్లే..

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు 8 నెలలుగా పెండింగ్‌లో ఉండటానికి గతంలో పని చేసిన ఓ ముఖ్య అధికారి సంతకాలు పెట్టకపోవడమే కారణం. దీని వల్ల పాలనా శాఖలో దాదాపు 600 బిల్లులు పేరుకపోయాయి. 2019 డిసెంబరు 31 తర్వాత అప్పటి అధికారి మార్చి నుంచి సంతకాలు పెట్టలేదు. దీంతో ఆపరేషన్‌ చేయించుకున్న ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో బిల్లులు మంజూరు కావాలి. అయితే కార్యాలయంలో 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు క్లర్క్‌లు కాసులకు కక్కుర్తి పడుతూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


జీవో ఏదీ..?

2019 డిసెంబరు 31 వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు చేయడానికి అనుమతి ఉంది. 2020 జనవరి నుంచి బిల్లులు మంజూరు కావాలంటే ప్రభుత్వం జీవోను విడుదల చేయాలి. ఈ జీవో విడుదల చేయకపోవడం వందల సంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం జీవో విడుదల చేసి బిల్లుల మంజూరయ్యేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు. 


హడావుడిగా సంతకాలు

తన బిల్లు పెండింగ్‌లో ఉన్నదని ఓ ఉద్యోగి పరిపాలన విభాగంలో క్లర్క్‌ను నిలదీయడంతో సూపరింటెండెంట్‌ డా. నరేంద్రనాథ్‌రెడిడ స్పందించారు. హడావుడిగా ధన్వంతరీ హాల్‌లో 2019 డిసెంబరు 31 వరకు పెండింగ్‌లో దాదాపు 130 బిల్లులపై సంతకాలు పెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులపై మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నామని, ఇక నుంచి పెండింగ్‌ లేకుండా బిల్లులన్ని మంజూరు చేస్తామని తెలిపారు. 2020 జనవరి 1 నుంచి బిల్లులు ఆమోదానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-06-06T09:20:34+05:30 IST