కంది, శనగ కొనుగోలు కేంద్రాలు బంద్‌

ABN , First Publish Date - 2020-03-19T11:23:15+05:30 IST

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. కందులు, శనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కంది, శనగ కొనుగోలు కేంద్రాలు బంద్‌

కోటా పూర్తయిందంటున్న మార్క్‌ఫెడ్‌

అదనపు కొనుగోళ్లకు ప్రతిపాదనలు

మద్దతు ధర లభించక రైతులకు నష్టం

వ్యాపారులకు అమ్ముతున్న అన్నదాతలు


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 18: జిల్లాలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. కందులు, శనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో కంది, శనగ రైతులు మంగళవారం ధర్నా చేశారు. డోన్‌, కర్నూలు, పత్తికొండ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 17 వేల టన్నుల కందులు, 23 వేల టన్నుల పప్పు శనగ కొనుగోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో కంది, 4.06 లక్షల ఎకరాల్లో పప్పుశనగ సాగు అయింది. ఎకరానికి 4 క్వింటాళ్ల  ప్రకారం మొత్తం 1.6 లక్షల క్వింటాళ్ల కందులు రైతుల ఇళ్లకు చేరాయి.


పప్పుశనగ ఎకరానికి 6 క్వింటాళ్ల ప్రకారం సుమారు 24 లక్షల క్వింటాళ్ల దిగుబడి రైతుల చేతికి అందింది. దిగుబడిలో సగమైనా ప్రభుత్వం కొంటుందని రైతులు ఆశించారు. ఈ లెక్కన కందులు 2.40 లక్షల క్వింటాళ్లు, శనగలు 12 లక్షల క్వింటాళ్లను ప్రభుత్వం మద్దతు ధరతో కొని ఉంటే తమకు మేలు జరిగేదని రైతులు అంటున్నారు. కానీ 1.70 లక్షల క్వింటాళ్ల కందులు, 2.10 లక్షల క్వింటాళ్ల శనగలను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా 2 లక్షల క్వింటాళ్ల పైగా కందులు, పప్పు శనగ దిగుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో కందులు, మార్చిలో శనగలను కొనేందుకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా 30 కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేయించింది. 


కొనుగోలు కేంద్రాలు మూత

ప్రభుత్వం అనుమతించిన నామమాత్రపు కోటా కొనుగోళ్లు పూర్తి అయ్యాయి. డీసీఎంఎస్‌ సిబ్బంది వారం క్రితమే కందులు, శనగలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వచ్చిన దిగుబడులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొనుగోలు కేంద్రాలు మూత పడ్డాయి. అదనపు కోటా కొనుగోలుకు అనుమతి వస్తేనే కొంటామని మార్క్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు. దీంతో రైతులు మార్కెట్‌యార్డులోని వ్యాపారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. 


అనుమతి వస్తుందా..? 

కందులు, శనగలను అదనంగా రైతుల నుంచి కొనేందుకు అనుమతి ఇవ్వాలని వారం క్రితమే మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌ చేశారు. రైతులు మార్క్‌ఫెడ్‌ కార్యాలయం, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని మార్కెట్‌ యార్డుల్లో పెద్ద పెద్ద కటౌట్ల ద్వారా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. వాస్తవంగా అరకొరగానే కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


శనగలు కొనుగోలు చేయడం లేదు: నూర్‌అహమ్మద్‌ రైతు, నందికొట్కూరు.

11 ఎకరాలలో శనగపంట సాగుచేశా. 60 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. వ్యసాయాధికారుల వద్దకు వెళ్లి శనగ సాగుచేసినట్లు పర్మిట్లు రాయించుకుని మార్కెట్‌యార్డుకు వచ్చాను. ఇక్కడ శనగలు కొనుగోలు చేయడం లేదు. రైతు సేవాకేంద్రం కూడా మూసివేశారు. అధికారులు శనగలు కొనుగోలు చేయాలి. 


అనుమతి కోరాము..సురేష్‌, మేనేజరు, మార్క్‌ఫెడ్‌

ప్రభుత్వం అనుమతించిన మేరకు రైతుల నుంచి కందులు, శనగలను కొనుగోలు చేశాము.  అదనంగా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం అనుమతిస్తే రెండో విడత కొనుగోలు ప్రారంభిస్తాము. 

Updated Date - 2020-03-19T11:23:15+05:30 IST