-
-
Home » Andhra Pradesh » Kurnool » pay the bills house
-
ఆ బిల్లులు చెల్లించరా..!
ABN , First Publish Date - 2020-12-30T05:47:20+05:30 IST
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- టీడీపీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణం
- లబ్ధిదారులకు రూ.121.7 కోట్ల బకాయిలు
- విచారణ పేరుతో సగానికి పైగా కోత
- వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 28: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి రూ.121.7 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 8,363 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. ఫ్రీ పీఎంఏవై, ఎన్టీఆర్ హౌసింగ్, ఎన్టీయార్ రూరల్ హౌసింగ్, పీఎంఏవై ఎన్టీఆర్ గ్రామీణ్, పీఎంఏవై ఎన్టీఆర్ అర్బన్ పథకాల కింద ఈ ఇళ్లు మంజూరు అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు రూ.1.5 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో లబ్ధిదారులకు రూ.2.5 లక్షలు సబ్సిడీ అమలు చేశారు. సొంత ఇల్లు మంజూరైందన్న సంతోషంతో పేదలు అప్పు చేసి నిర్మించుకున్నారు. కొందరు నగానట్రా కుదువపెట్టి ఖర్చు చేశారు. వీరందరూ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచింది. ఇప్పటికీ బిల్లుల చెల్లింపుల గురించి పట్టించుకోవడం లేదు.
విచారణ పేరిట కోత
టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లలో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హౌసింగ్ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేత పలు దఫాలుగా తనిఖీలు చేయించి, జియో ట్యాగింగ్ చేయించింది. ఏడాది క్రితం అర్హుల జాబితాను తయారు చేసి జిల్లా హౌసింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. విచారణ పేరుతో సగం ఇళ్ల కోత పెట్టారు. నిర్మాణాలు ప్రారంభం కాని 40 వేల ఇళ్లను రద్దు చేశారు. పెండింగ్ బిల్లులు రూ.121.7 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా, అంతకంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.
పాతవి వదిలేసి..
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న జిల్లాలో 2 లక్షలకు పైగా ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 1,30,303 ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడత 98,388 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతిల్లు లేని పేదలకు ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇస్తే మంచిదేనని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టుకున్న తమకు బకాయిలు చెల్లించకపోతే ఎలా అని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన తాము లబ్ధిదారులు కాకుండా పోతామా..? అని ప్రశ్నిస్తున్నారు. బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెల్లింపులు జరుగుతున్నాయి..
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి రూ.121.7 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.30 కోట్ల దాకా పెండింగ్ ఉంది. ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తోంది. ఇది పూర్తి కాగానే గ్రామీణ ప్రాంతాలవారికి చెల్లింపులు జరుగుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరసం లేదు.
- నాగరాజు, జిల్లా గృహ నిర్మాణ సంస్థ కన్‌స్ట్రక్షన్ ఈఈ