పురుగు మందుల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-16T05:19:13+05:30 IST

మండలంలోని శింగనపల్లె గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పురుగు మందులను వ్యవసాయాధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

పురుగు మందుల స్వాధీనం

అవుకు, డిసెంబరు 15: మండలంలోని శింగనపల్లె గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పురుగు మందులను వ్యవసాయాధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. శింగనపల్లె గ్రామానికి చెందిన మునగల రామక్రిష్ణారెడ్డి అనే వ్యక్తి లైసెన్స్‌ లేకుండా పురుగు మందులను విక్రయిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్‌ సీఐ నాగరాజు యాదవ్‌, ఎస్‌ఐ జయన్న, అగ్రికల్చర్‌ అధికారి రూఫస్‌ రోనాల్డ్‌ ఈ నెల 14వ తేదీన రామక్రిష్ణారెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి లైసన్స్‌ లేకుండా నిల్వ చేసిన రూ. 7 లక్షల విలువ చేసే పురుగు మందులను గుర్తించారు. వీటికి పంచనామా నిర్వహించి మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఉదయం హార్టికల్చర్‌ ఆఫీసర్‌ షేక్‌ బాషా, ఎంపీఈవో నరసింహారెడ్డి శింగనపల్లెలోని రామక్రిష్ణారెడ్డి ఇంటికి వెళ్లి పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్వాధీనం చేసుకున్న పురుగు మందులు తమ ఆధీనంలోనే ఉంటాయని వ్యవసాయాధికారి శ్రీకృష్ణ తెలిపారు. అవుకులోని బీసీ వెంకటసుబ్బయ్య ఫర్టిలైజర్స్‌, ఫెస్టిసైడ్స్‌ దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు దాడులు జరిపినప్పటికీ ఎలాంటి వివరాలు వెల్లడించక పోవటంలోని ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారుల దాడులతో అవుకు పట్టణంలోని వ్యాపారులు దుకాణాలను మూసివేయటం గమనార్హం. 


జోరుగా నిషేధిత పురుగు మందుల అమ్మకాలు 

నిషేధిత పురుగు మందులను విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదు. నిషేధిత పురుగు మందులను అవుకు పట్టణంతో పాటు, పలు గ్రామాల్లో జోరుగా అమ్మకాలు జరుగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు దాడులు విస్తృతం చేసి నాణ్యమైన పురుగు మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-16T05:19:13+05:30 IST