శార్వరి.. శుభంకరి

ABN , First Publish Date - 2020-03-26T08:02:17+05:30 IST

శార్వరీ నామ సంవత్సర ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఆ తరువాత ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పేర్కొన్నారు.

శార్వరి.. శుభంకరి

ఈ ఏడాది ఆరంభంలోనే ఇబ్బందులు

ఆ తరువాత అన్నీ శుభాలే

దేశ వ్యాప్తంగా సగటు వర్షపాతం

శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ

ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం


శ్రీశైలం, మార్చి 25: శార్వరీ నామ సంవత్సర ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఆ తరువాత ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పేర్కొన్నారు. కరోనా ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ఉగాది సందర్భంగా బుధవారం పంచాంగం చదివి వినిపించారు. పండుగ రోజున భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో రుద్రహోమం, అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.


ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేద పండితులు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజ జరిపించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. నూతన పంచాంగానికి షోడశోపచారాలు జరిపించారు. ఈవో కేఎస్‌ రామరావు పండితులకు నూతన వస్త్రాలను అందజేశారు. 

పంచాంగ శ్రవణం

ఈ ఏడాది శుభ గ్రహాలకు 8 ఆధిపత్యాలు, పాపులకు ఒక ఆధిపత్యం మాత్రమే వచ్చిందని ఆస్థాన సిద్ధాంతి తెలిపారు. బుధుడు-రాజు, ధాన్యాధిపతిగాను, చంద్రుడు- మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతిగాను, గురుడు-సస్యాధిపతి, నీరసాధిపతిగాను ఉంటారని వివరించారు. శని రసాధి పతిగా ఉంటారని, పాలనా ప్రజారంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులసంక్షేమానికి పాలకులు పెద్దపీట వేస్తారని అన్నారు. మన దేశంలో ఆర్థిక మాంద్యం ప్రభావం అంతగా ఉండదని పేర్కొన్నారు. అనేక పరిశ్రములు ఏర్పాటు చేస్తారని తెలిపారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయన్నారు.


వర్షాకాలంలో పలుచోట్ల వడగండ్ల వానలు పడుతాయని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలు అభివృద్ధి పథంలో సాగుతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా సగటు వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. నైరుతి, ఈశాన్య ఋతుపవన ప్రభావం బాగుంటుందని అన్నారు. సకాలంలో అనుకూల వర్షాలు కురుస్తాయని, నదులలో నీరు సమృద్ధిగా ఉంటుందని తెలిపారు. ఎర్ర, ఇసుక నేలల్లో పంటలు బాగా పండుతా యని, దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం రెండు గ్రహణాలు ఏర్పడతాయని, ఒకటి కంకణాకార సూర్య గ్రహణం, మరొకటి సంపూర్ణ సూర్య గ్రహణం అని తెలిపారు. ఈ సంవత్సరం గురుని 3 రాశుల సంచారం వల్ల మకరరాశిలో కుజ, గురు, శనిగ్రహాల కలయిక వల్ల రెండుసార్లు కాలసర్ప యోగం సంభవిస్తుందని, దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అందరూ దైవ ధ్యానం, పూజాదికాలతో జాగ్రత్త పడాలని సూచించారు. 


నేటితో ఉత్సవాల సమాప్తి

ఉగాది మహోత్సవాలు గురువారం ముగుస్తాయి. సాయంత్రం అమ్మవారు భ్రమరాంబదేవి అలంకారంలో దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి కల్యాణోత్సవం, ఏకాంతసేవ  నిర్వహిస్తారు.


రమావాణీసేవిత రాజరాజేశ్వరి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా అలంకరించారు. అమ్మవారిని అలంకార మండపంలోకి తొడ్కొని వచ్చి విశేష పూజాదికాలను నిర్వహించారు. చతుర్భుజా లతో అమ్మవారు పాశం, అంకుశం, పద్మం, చెరకుగ డను ధరించి దర్శనమిచ్చారు. ఈ దేవిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని, సమస్యలు తొలగిపోతా యని భక్తుల విశ్వాసం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు  దర్శనాలను పూర్తిగా నిలిపేశారు. ఉత్సవాలు ఆలయానికే పరిమితమయ్యాయి. 

Updated Date - 2020-03-26T08:02:17+05:30 IST