మా వాళ్లే.. చూసీచూడనట్లు వెళ్లు..!
ABN , First Publish Date - 2020-12-15T05:43:49+05:30 IST
గుప్తనిధుల కోసం తవ్వకాల్లో ఓ వైసీపీ నాయకుడి అనుచరుల పేర్లు వినిపిస్తున్నాయి.
- పోలీసులపై ఓ వైసీపీ ముఖ్య నాయకుడి ఒత్తిళ్లు
- గుప్తనిధుల తవ్వకాల్లో ఆ నాయకుడి అనుచరులు
- కేసు నమోదు కాకుండా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
- కేసు పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ ఆరోపణ
కర్నూలు, ఆంధ్రజ్యోతి: గుప్తనిధుల కోసం తవ్వకాల్లో ఓ వైసీపీ నాయకుడి అనుచరుల పేర్లు వినిపిస్తున్నాయి. కేసులో వారి పేర్లు చేర్చకుండా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. దీనిపై బీజేపీ జిల్లా నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుడి ముఖ్య అనుచరులు కావడంతో తప్పించారని బీజేపీ నాయకుడు హరీశ్‌బాబు ఆరోపిస్తున్నారు. గూడూరు మండలం పొన్నకల్ సమీపంలో ఈ నెల 10న అర్ధరాత్రి ఆంజనేయ స్వామి, అమ్మవారి విగ్రహాలను దుండగులు పెకిలించారు. గుప్తనిధుల కోసం తవ్వారు. ఈ కేసులో పోలీసులు ఒక ఎక్స్‌కవేటర్ యజమాని, డ్రైవర్‌ను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా ఓ వైసీపీ ప్రజాప్రతినిధి అనుచరుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తీగ లాగేందుకు పోలీసులు యత్నిస్తుండగా.. రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. తమ అనుచరులను అదుపులోకి తీసుకుంటే ఊరుకునేదిలేదని ఓ నాయకుడు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో అసలు నిందితులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఓ ఎక్సైజ్ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గ ముఖ్య నాయకుడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే నిందితుల పేర్లను ప్రకటించలేదు. వారిని ఎస్పీ కార్యాలయంలో హాజరుపరచిన అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
బీజేపీ నాయకుల పరిశీలన
విగ్రహాలను పెకలిం చిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకుడు కగ్గోలు హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. హిందూ జాగరణ యాత్రలో భాగంగా దేవాలయ ప్రాంగణాన్ని సోమవారం పరిశీలించారు. హరీష్ మాట్లాడుతూ నిందితులను తప్పించేందుకు ఎమ్మెల్యే జె.సుధాకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా అరెస్టు చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు కూడా జంకుతున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. హిందూ ధర్మానికి, సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ఘటనపై నిందితులను ఎందుకు కాపాడుతున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. త్వరలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటనలో నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు.
అలాంటిదేమీ లేదు
రెండు రోజుల్లో నిందితుల వివరాలను వెల్లడిస్తాం. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. విచారణ లోతుగా జరుగుతుండడం వల్ల ఆలస్యమవుతోంది. అంతేకానీ ఎలాంటి దాపరికాలు లేవు. ఎవరెవరు ఈ తవ్వకాల్లో పాల్గొన్నారో ప్రకటిస్తాం. - పార్థసారథిరెడ్డి, సీఐ, కోడుమూరు