వెనక్కి తీసుకో..!
ABN , First Publish Date - 2020-06-25T11:03:13+05:30 IST
ఈ ఫొటోలో ఉన్నది కర్నూలు మార్కెట్ యార్డు ప్లాట్‌ఫారం. రూ.5 కోట్లతో ఆధునికరించేందుకు టెండర్లు పిలిచారు.

కాంట్రాక్టర్లకు అధికార పార్టీ బెదిరింపులు
ఆన్‌లైన్ టెండరు ప్రక్రియలో జోక్యం
జిల్లాలో రూ.50 కోట్ల పనులకు టెండర్లు
ఇతర ప్రాంతాల వారు రాకుండా హెచ్చరికలు
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 21: ఈ ఫొటోలో ఉన్నది కర్నూలు మార్కెట్ యార్డు ప్లాట్‌ఫారం. రూ.5 కోట్లతో ఆధునికరించేందుకు టెండర్లు పిలిచారు. ఇదే యార్డులో రూ.16 లక్షలతో విద్యుదీకరణ పనులు, రూ.41 లక్షలతో సీసీ రోడ్లు, రూ.43 లక్షలతో 20 వ్యాపార దుకాణాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.. రూ.61 లక్షలతో ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన ఆన్‌లైన్ టెండర్లు ఆహ్వాఇంచారు. ఈ పనులకు ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు. ఈ పనులను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులను కొందరు కాంట్రాక్టర్లు ఆశ్రయించారు. బయటి ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు రావడానికి వీల్లేదని బెదిరిస్తున్నారు.
మార్కెట్ యార్డు టెండర్ల కోసం అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఆన్‌లైన్ టెండర్లు వేసినవారికి ఫోన్ చేసి వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కాదని టెండర్లు దక్కించుకున్నా పనులు చేసుకోలేరని సూటిగా చెప్పేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 15 మార్కెట్ యార్డుల్లో దాదాపు రూ.50 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. గోదాముల నిర్మాణం, ప్లాట్‌ఫారం మరమ్మతులు, డ్రైనేజీ కాల్వలు, సిమెంటు రోడ్లు తదితర పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 23 వరకూ టెండర్లు వేయవచ్చని మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. కొందరు కాంట్రాక్టర్లు ఇప్పటికే టెండర్లు వేశారు. వీరికి యార్డుల పరిధిలోని అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
జిల్లాలో 15 యార్డుల్లో వివిధ రకాల పనులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు యార్డుకు రూ.10 కోట్లు, నంద్యాల యార్డుకు రూ.10 కోట్లు, ఆదోని రూ.10 కోట్లు, డోన్ రూ.3 కోట్లు, ఆత్మకూరు రూ.4 కోట్లు ఇలా ఒక్కో యార్డుకు కొంత సొమ్ము కేటాయించింది. ఈ నెల 23లోగా టెండర్లు దాఖలు చేయాలని మార్కెటింగ్ శాఖ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. గతంలో కడప రీజినల్ కార్యాలయం, అమరావతిలోని కమిషనర్ కార్యాలయంలో టెండర్లు వేసేవారు. ఈ సారి అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లందరికీ అవకాశం కల్పించేలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంట్రాక్టర్లు స్వాగతించారు. ఆన్‌లైన్‌లో టెండర్లు వేశారు. కానీ వీరి వివరాలను తెలుసుకున్న అధికార పార్టీ నాయులు నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.
అనుచరుల కోసం..
జిల్లాలోని మార్కెట్ యార్డు పనుల్లో ఇప్పటిదాకా రాజకీయ జోక్యం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సారి కొత్తగా నాయకుల బెదిరింపులు ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా టెండర్లు వేసే అవకాశం ఇస్తే పోటీ పెరుగుతుందని, ప్రభుత్వం నిర్ణయించిన అంచనా ధర కంటే తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు అవుతాయని అంటున్నారు. ప్రస్తుతం అధికార పారీ ్టనాయకులు తమ అనుచరులకే పనులు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే ఎక్కువ ధరకు టెండర్లు వేస్తారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ తీరు వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుందని అంటున్నారు.
స్వేచ్ఛగా టెండర్లు..
జిల్లాలో రూ.50 కోట్ల పనులకు ఈ నెల 23లోగా కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకోవచ్చు. నేరుగా కార్యాలయాలకు వెళ్లి టెండర్లు వేయొచ్చు. లేదా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. పనులల్లో నాణ్యత మాకు ముఖ్యం. కాంట్రాక్టర్లపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. మాపై రాజకీయ ఒతిళ్లు పని చేయవు.
- సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ డీఈఈ