-
-
Home » Andhra Pradesh » Kurnool » options are closed for teachers transfers
-
ఆప్షన్లు ముగిశాయి
ABN , First Publish Date - 2020-12-19T05:42:25+05:30 IST
ఉపాధ్యాయ బదిలీల్లో ఆప్షన్లను ఎన్నుకోడానికి గడువు శుక్రవారంతో ముగిసింది.

- ఉపాధ్యా య బదిలీల్లో ఒక అంకం పూర్తి
- చుక్కలు చూసిన టీచర్లు
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 18: ఉపాధ్యాయ బదిలీల్లో ఆప్షన్లను ఎన్నుకోడానికి గడువు శుక్రవారంతో ముగిసింది. దాదాపు నెలన్నరగా ఉపాధ్యాయ రేషనలైజేషన్ బదిలీ ప్రక్రియ ఉపాధ్యాయులకు కునుకు పట్టనీయకుండా చేసింది. అధిక సంఖ్యలో ఖాళీలను బ్లాక్ చేయడం, ఆప్షన్ల ప్రక్రియలో సర్వర్లు మొండికేయడంతో ఉపాధ్యాయులు విసిగి బేజారయ్యారు. మారుమూల గ్రామాల పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి వాటిని నడింపించాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ సీనియర్ టీచర్లకు బదిలీల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయ రేషనలైజేషన్, బదిలీ ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఉపాధ్యాయ సంఘాల ఆందోళన హోరెత్తింది. ఈ ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వం చివరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులను అరెస్టు చేయించి కేసులు పెట్టించింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు కేటగిరీలతో కలిపి మొత్తం 2,188 ఖాళీలు ఉండగా, బదిలీల కోసం 6,343 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 224 మంది, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 144, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 3,337, స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 1743, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్)895 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. 8 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకునేందుకు రాత్రింబవళ్లు నెట్ సెంటర్ల దగ్గర కుస్తీ పడ్డారు. ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు అన్ని ఆప్షన్లు నమోదు చేయాలి. జిల్లాలో 2 వేలకు పైగా ఖాళీలు ఉంటే.. అన్నింటికి వాళ్లు ఆప్షన్లు ఇవ్వాలి. ఈ ఖాళీలను వెతుకునేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడ్డారు. ఖాళీలను పూరించాక సబ్‌మిట్ నొక్కగానే సర్వర్ డౌన్ అయ్యేది. దీంతో పూర్తి స్థాయిలో ఆప్షన్లు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం వల్లే ఈ నెల 15వ తేదీతో ముగిసిన ఆప్షన్ల గడువును శుక్రవారం వరకు రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. బదిలీలపై ముందుగా ఉపాధ్యాయులకు డెమో వేసి చూపిస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పినా అమలులోకి రాలేదు. దీని వల్ల ఆప్షన్ల నమోదుకు అవస్థలు పడాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. బదిలీ కౌన్సెలింగ్ మాన్యువల్ విధానంలో నిర్వహించి ఉంటే ముఖ్యంగా ఎస్జీటీలకు ఈ ఇబ్బందులు తప్పేవని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.