రేపటి నుంచి ఓపీ సేవలు

ABN , First Publish Date - 2020-12-06T05:21:39+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ అడ్మినిస్ర్టేటివ్‌ భవనంలో క్యాజువాల్టీ సేవలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి ఓపీ సేవలు
క్యాజువాల్టీ ముఖద్వారానికి రంగులు వేస్తున్న సిబ్బంది

  1. అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోకి క్యాజువాల్టీ
  2. కంటి ఆసుపత్రి నుంచి రోగుల తరలింపు
  3. కొవిడ్‌ కేసులు తగ్గిపోవడంతో నిర్ణయం


కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 5: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ అడ్మినిస్ర్టేటివ్‌ భవనంలో క్యాజువాల్టీ సేవలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. జిల్లాలో కొవిడ్‌ కేసులు అధికంగా నమోదు కావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ప్రభుత్వం స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంటి ఆసుపత్రిలో క్యాజువాల్టీ, ఓపీ సేవలను ప్రారంభించారు. కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడం, సాధారణ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంతో రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో గతంలో ఓపీ నిర్వహిస్తున్న విభాగాల్లో యథావిధిగా సోమవారం నుంచి సేవలు ప్రారంభిస్తామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీఎస్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో క్యాజువాల్టీ వైద్యసేవలు పాత ప్రదేశంలోనే ఇప్పటికే ప్రారంభించామని ఆయన తెలిపారు. 


గేటు విరిగిపోయి..

ఆసుపత్రిలో అడ్మిషన్‌ ఓపీ కౌంటర్‌ (ఓపీ నెంబర్‌ 10) సమీపంలో ఉన్న గేట్‌  మూడు రోజుల క్రితం విరిగిపోయింది. దీంతో ప్రాంతీయ కంటి ఆసుపత్రి నుంచి క్యాజువాల్టీకి రోగులను మార్చేందుకు ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. వెంటిలేటర్‌ మీద ఉన్న అత్యవసర రోగులను కంటి ఆసుపత్రి క్యాజువాల్టీ నుంచి అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌ క్యాజువాల్టీకి తరలించాలంటే 24 గంటల ల్యాబ్‌, సర్జికల్‌ బ్లాక్‌, పెయింగ్‌ బ్లాక్‌ మీదుగా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఇబ్బందిగా ఉందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి అధికారులు తక్షణమే విరిగిన గేట్‌కు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. 


పాత భవనంలోనే సేవలు

పెద్దాసుపత్రిలో గతంలో ఓపీ, క్యాజువాల్టీ సేవలు నిర్వహించిన భవనంలోనే సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తిరిగి సేవలు ప్రారంభిస్తున్నాం. సాధారణ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలి. - డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌, కర్నూలు జీజీహెచ్‌


ప్రక్రియను ప్రారంభించాం 

సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు క్యాజువాల్టీని అడ్మినిస్ర్టేటివ్‌ భవనంలో ఉన్న పాత క్యాజువాల్టీలోనికి మార్చే ప్రక్రియను రెండు రోజుల క్రితం ప్రారంభించాం. కొవిడ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 25 నుంచి కంటి ఆసుపత్రిలోనే క్యాజువాల్టీని నిర్వహిస్తున్నాం. అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే సగం మంది క్యాజువాల్టీ రోగులను షిఫ్ట్‌ చేశారు. మిగిలిన వారిని కూడా షిఫ్ట్‌ చేసి పాత క్యాజువాల్టీలోనే పూర్తి స్థాయిలో సేవలు అందిస్తాం. - డాక్టర్‌ ఎస్‌.మంజుల, క్యాజువాల్టీ మెడికల్‌ ఆఫీసర్‌
Updated Date - 2020-12-06T05:21:39+05:30 IST