ఎవ్వరూ రాలేదు

ABN , First Publish Date - 2020-07-22T10:43:20+05:30 IST

జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో ఏర్పాటు చేసిన మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌

ఎవ్వరూ రాలేదు

ఖాళీగా తంగడంచె ఎంఎస్‌ఎంఈ పార్కు

ఏడాదిన్నరగా ఒకే ఒక్క రిజిస్ట్రేషన్‌

దెబ్బతింటున్న రోడ్లు, డ్రైనేజీలు


నందికొట్కూరు/జూపాడుబంగ్లా, జూలై 18: జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో ఏర్పాటు చేసిన మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) పార్కులో ఏడాదిన్నర గడిచినా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. నాణ్యతా లోపం, నిర్వహణ లేకపోవడంతో పార్కులో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. తంగడంచలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి  అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావించింది. స్థలాలను సేకరించి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మురుగునీటి వ్యవస్థ, బీటీ రోడ్డు నిర్మించింది. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. దీంతో బీటీ రోడ్లకు అడుగడుగునా పగుళ్లు ఏర్పడ్డాయి. డ్రైనేజీ కాల్వల పరిస్థితి కూడా అలాగే ఉంది. 


50 ఎకరాల్లో పార్కు

తంగడంచలో ఎంఎస్‌ఎంఈ పార్కును 50 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. 250 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే వారికి 300 నుంచి 853 చదరపు మీటర్ల వరకు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. రూ.6.40 కోట్లతో బీటీ రోడ్లు,  డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. ఇలా మౌలిక వసతులను కల్పించినా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. 


ఒకే దరఖాస్తు

తంగడంచలో పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటి వరకూ ఒకరే రిజిస్టర్‌ చేసుకున్నారు. మరో రెండు దరఖాస్తులు వచ్చాయని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. వారు డబ్బు చెల్లిస్తే రిజిస్ర్టేషన్‌ చేయించి ఇస్తామని ఏపీఐఐసీ మేనేజర్‌ మాధవీ లత తెలిపారు.   అయితే మౌలిక వసతులలో నాణ్యత లేనందుకే ఎవరూ ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 


నోటీసులు ఇస్తాం..

తంగడంచ పార్కులో వాహనాలు తిరగకపోవడం వల్ల బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయి. రోడ్లను బాగు చేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇస్తాం. నిర్మాణాలు పూర్తయ్యాక రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌దే. కాబట్టి మళ్లీ పనులు చేయిస్తాం. 

- రాంప్రసాదరెడ్డి, ఏపీఐఐసీ ప్రాజెక్టు డీఈ

Updated Date - 2020-07-22T10:43:20+05:30 IST