మట్టి కలిసిన ఇసుక

ABN , First Publish Date - 2020-03-04T09:32:48+05:30 IST

నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణాలు పటిష్టంగా ఉంటాయి. ఇసుకలో మట్టి కలిస్తే..? పది కాలాలపాటు ఉండాల్సిన నిర్మాణాలు త్వరగా దెబ్బతినిపోతాయి.

మట్టి కలిసిన ఇసుక

నాసిరకంతో ఎలా అంటున్న స్థానికులు 

 పనిచేయని ఆన్‌లైన్‌ బుకింగ్‌ 

పట్టించుకోని అధికారులు 


బనగానపల్లె, మార్చి 3: నాణ్యమైన ఇసుకతోనే నిర్మాణాలు పటిష్టంగా ఉంటాయి. ఇసుకలో మట్టి కలిస్తే..? పది కాలాలపాటు ఉండాల్సిన నిర్మాణాలు త్వరగా దెబ్బతినిపోతాయి. ముఖ్యంగా ఇండ్ల స్లాబ్‌, ప్లాస్టరింగ్‌కు నాణ్యతలేని ఇసుక పనికి రాదు. కానీ  బనగానపల్లె మార్కెట్‌ యార్డులోని ఇసుక సరఫరా కేంద్రంలో ఇలాంటిదే సరఫరా చేస్తున్నారు.  అవుకు, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల మండలాల  ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.  


బనగానపల్లె సబ్‌ డివిజన్‌ కోసం పట్టణంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని  ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పామిడి నుంచి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌  అధికారులు ఇక్కడికి ఇసుకను సరఫరా చేస్తున్నారు. అయితే ఇది నాసిరకంగా ఉంది. అందువల్ల  ప్రజలు దీన్ని కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. 


నాసిరకం ఇసుక సరఫరా

బనగానపల్లె పట్టణంలోని మార్కెట్‌యార్డుకు తాడిపత్రి, పామిడి రీచ్‌ నుంచి మట్టి కలిసిన ఇసుకను సరఫరా చేస్తున్నారు.   టన్నుకు రూ.975 వసూలు చేస్తున్నారు.   ఒక   ట్రాక్టర్‌   తీసుకుపోవాలంటే రూ.4,387 రూపాయల ఖర్చు వస్తోంది.  ట్రాక్టర్‌ బాడుగ అదనంగా బనగానపల్టె పట్టణానికి అయితే రూ.500 చెల్లించాలి. గ్రామాలకైతే  మరింత చెల్లించాల్సి వస్తోంది. అంటే బనగానపల్లెకు   తీసుకుపోవాలంటే సుమారు రూ.5వేలు, గ్రామాలకైతే ఇంకా ఎక్కువ ఖర్చవుతోంది. ఇంత ఖర్చు పెట్టుకున్నా నాసిరకం ఇసుక సరఫరా అవుతోందని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇది ఇండ్ల నిర్మాణంలో ప్లాస్టింగ్‌కు, శ్లాబ్‌కు పనికి రాదు. అయినా   తప్పనిసరి  పరిస్థితిలో కొందరు కొంటున్నారు.   మరి కొందరు   ధర  ఎక్కువ అయినా పాణ్యం నుంచి  తెచ్చుకుంటున్నారు.


అక్కడ   టన్ను ఇసుక రూ. 1200  పలుకుతోంది.   శ్లాబ్‌, ప్లాస్టింగ్‌ కోసం అక్కడినుంచి  తెచ్చుకుంటున్నారు. నాసిరకం ఇసుక సరఫరా గురించి   ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.   మిగతా చోట్ల నాణ్యమైన ఇసుక సరఫరా అవుతుండగా బనగానపల్లెలోనే నాసిరకం ఇసుక ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు ఎదువుతున్నాయి. 


వారం రోజులుగా పనిచేయని ఆన్‌లైన్‌

 ఇసుక  నాసిరకంగా ఉన్నా గోడలు నిర్మించుకోవడానికి దీన్నే స్థానికులు కొంటున్నారు.  అయితే గత వారం రోజుల నుంచి ఆన్‌లైన్‌లో ఇది కూడా అందుబాటులో లేదు.  బుక్‌ చేయడానికి  గంటలకొద్దీ ప్రయత్నించినా ఆన్‌లైన్‌లో సైట్‌ ఓపెన్‌ కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈవిషయం మైనింగ్‌ అధికారుల దృష్టికి తీసుకుపోగా తమకు సమాచారం లేదని అంటున్నారు.  


నాసిరకం ఇసుకతో నిత్యం ఇక్కట్లు - కోడి నాగరాజుయాదవ్‌,  మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ 

బనగానపల్లె పట్టణంలోని మార్కెట్‌ యార్డుకు నాసిరకం ఇసుక సరఫరా అవుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్పులేదు. ఆంధ్రప్రదేశ్‌  మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా స్పందించడం లేదు. మంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలి.  


వారం రోజులుగా పనిచేయని ఆన్‌లైన్‌ సేవలు - రంగస్వామి యాదవ్‌, క్రిష్ణగిరి 

ఇసుకను బుక్‌  చేసుకుందామంటే వారం రోజులుగా ఆన్‌లైన్‌ సైట్‌ పనిచేయడం లేదు. గంటల కొద్ది ప్రజలు బుకింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇసుక బుక్‌ కావడం లేదు. అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలి.  

Updated Date - 2020-03-04T09:32:48+05:30 IST