తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-11-27T05:25:38+05:30 IST

నివర్‌ తుఫాన్‌ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి
చాగలమర్రిలో అధికారులతో చర్చిస్తున్న జేసీ రామసుందర్‌ రెడ్డి

  1. అధికారుల సూచన


నంద్యాల, నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం నంద్యాలలో సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచన మేరకు ప్రజలందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిపారు. తుఫాన్‌ను ఎదుర్కొవడానికి, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగం, సిబ్బంది చేసే సూచనలను ప్రజలందరూ పాటించాలని సూచించారు. ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, వ్యవసాయ అను బంధ శాఖల అధికారులు చెప్పే సూచనలు పాటించాలని తెలిపారు. నివర్‌ తుఫాన్‌ సహాయక చర్యల కోసం నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 08514 -221550 లేదా 8333989013కి ఎవరైనా సంప్రదించవచ్చని తెలిపారు.


చాగలమర్రి: నివర్‌ తుఫాన్‌తో గ్రామాల ప్రజలు, రైతులు, కూలీలు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని జేసీ రామసుందర్‌రెడ్డి సూచించారు. గురువారం రాత్రి చాగలమర్రి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో చర్చించారు. తుఫాన్‌ ప్రభావం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జేసీ మాట్లాడుతూ చాగలమర్రి గ్రామం కడప జిల్లా సరిహద్దు కావడంతో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని, ఇప్పటికే 55.8 మీ.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. తుఫాను ప్రభావితం చూపే ప్రాంతాల్లో అందరిని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రాంతాల వైపు వెళ్లొదని ప్రజలకు సూచించారు. వారం రోజుల పాటు రైతులు పంటలను కోతలు కోయకుండా పొలంలోనే ఉంచాలని సూచించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. భోజనం, నివాసం, వైద్య సేవలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ శివశంకర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో లక్ష్మీనాగేంద్రయ్య, వైద్యాధికారి గంగాధర్‌, సూపర్‌వైజర్‌ రామలింగారెడ్డి, ఆర్‌ఐ విజయలక్ష్మి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, వీఆర్వోలు హరినాథ్‌, హసన్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


గోస్పాడు: రాష్ట్రంలో నివర్‌‌ తుఫాన్‌ ప్రభావం నాలుగు రోజుల పాటు ఉంటుందని, దీని నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయాధికారి సుధాకర్‌ సూచించారు. ముఖ్యంగా వరి పంట కోత దశలో ఉంటే నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాలువ ద్వారా నీటిని బయటకు పంపి పొలాన్ని ఎండబెట్టాలని సూచించారు. వర్షానికి ధాన్యం తడిచినట్లైతే ఒక క్వింటా ధాన్యానికి ఒక కిలో ఉప్పు లేదా 4 కేజీల వరి ఊక కలిపి ఆరబెట్టుకోవాలని, దీని వల్ల గింజ మొలకెత్తదని తెలిపారు. వరి చిరుపొట్టదశలో ఉంటే పొలాల్లో నీరు తోడేసి ఎకరాకు 30 కేజీల యూరియా, 15 కేజీల ఎంవోపీ వేయాలని వ్యవసాయాధికారి సూచించారు. కోసిన ధాన్యాన్ని పట్టలు కప్పుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.


చాగలమర్రి: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి వెంకటసుబ్బారెడ్డి సూచించారు. గురువారం పశువైద్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాబోవు రెండు రోజుల్లో నివర్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మట్టిమిద్దెలు, కల్వర్టులు, పూరిగుడిసెలు, రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయంలో ఉద్యోగులు, వీఆర్వోలు, కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైన సహాయ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుడు గంగాధర్‌ సూచించారు. గురువారం ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావంతో చలిగాలులు అధికమయ్యాయని, దీని ద్వారా జ్వరం, జలుబు, వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధులు సోకిన వెంటనే వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచించారు.


దొర్నిపాడు: నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ జయప్రసాద్‌, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సూచించారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


రుద్రవరం: మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ వెంకటశివ సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి కార్యాలయానికి చేరవేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో 26 ఎంఎం వర్షం పాతం నమోదైందని తెలిపారు. కేవలం రెండు గంటల్లో వీచిన బలమైన గాలి, వానతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రైతులు భయాందోళన చెందకుండా ఉండాలని సూచించారు. ఏదైన సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేయవద్దని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర సిబ్బందికి సూచించారు. గురువారం సాయంత్రం రుద్రవరం పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫోన్‌ చేస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి సమాచారం సేకరించాలన్నారు. వాగులు, వంకలు ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆదేశించారు. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఎస్‌ఐలు రామ్మోహన్‌రెడ్డి, మౌళి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-27T05:25:38+05:30 IST