-
-
Home » Andhra Pradesh » Kurnool » Nominations for MPTC and ZDPTC elections
-
15న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
ABN , First Publish Date - 2020-03-13T11:37:18+05:30 IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీలకు శుక్రవారంతో నామినేషన్ గడువు ముగుస్తుంది.

970 పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికలు
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల దృష్టి
ఏకగ్రీవానికి అధికార పార్టీ ప్రయత్నాలు
భారీ ఖర్చుకు సిద్ధమంటున్న ఆశావహులు
కర్నూలు(కలెక్టరేట్) మార్చి 12: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీలకు శుక్రవారంతో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఇక మిగిలింది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడమే. ఈ నెల 15న తొలి విడత, 17న రెండో విడత షెడ్యూల్ విడుదల అవుతుంది. పల్లె ప్రథమ పౌరుడి (సర్పంచ్) ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమౌతున్నారు. మరికొందరు ఔత్సాహిక యువకులు స్వతంత్రులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 972 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. 970 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 15న షెడ్యూల్, 17న నోటిఫికేషన్ విడుదల కానున్నాయి.
పట్టు కోసం ప్రయత్నాలు
పంచాయతీ ఎన్నికలను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు ప్రధాన పార్టీల రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలల్లో విజయం సాధించిన వైసీపీ.. అధికార దర్పంతో బరిలోకి దిగుతోంది. సాధారణ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు బదులు తీర్చుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలూ అన్వేషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన కీలక పంచాయతీల్లో ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక కోసం..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారు ఎక్కువయ్యారు. అధికార పార్టీలో ఒక్కొక్క గ్రామంలో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఏడాదిన్నర నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో పారిశుధ్యం గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో 150 పైగా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి ఏకగ్రీవాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిన్నటి వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన నాయకులు, ఇప్పుడు సర్పంచు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో తమకు అనుకూలమైన వారితో కొందరు శిబిరాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.
ఖర్చుకు తగ్గేది లేదు..
పంచాయతీ ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని కొందరు అంటున్నట్లు తెలిసింది. మేజర్ పంచాయతీలలో డబ్బు కీలకం కానుంది. సాధారణ పంచాయతీల్లో కూడా ఖర్చుకు వెనుకాడే పరిస్థితులు కనిపించడం లేదు. ఎంత చిన్న పంచాయతీ అయినా కనీసం రూ.5 లక్షలు ఖర్చు తప్పదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సగటున ఒక్కో పంచాయతీలో రూ.20 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలనూ వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. పోటీ తప్పదని భావిస్తే గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న టీడీపీ తమ మద్దతు దారులను గెలిపించుకుని గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ, జనసేన కూడా తమ మద్దతుదారులను బరిలో దింపుతున్నాయి.
అధికారులు బిజీ
మరో రెండు రోజుల్లో సర్పంచ్‌ల ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది. 972 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఓటర్ల జాబితాను రూపొందించారు. 47 లక్షల బ్యాలెట్ పేపర్లను ముద్రించి స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. రిటర్నింగ్ ఆఫీసర్‌లు, పోలింగ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు.
సర్పంచు రిజర్వేషన్లు
జిల్లాలో 972 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి సర్పంచు స్థానాలను వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు చేశారు. వీటిలో తండాలు 20 (5 జనరల్, 15 మహిళలు), ఎస్టీ 15 (మొత్తం మహిళలు), ఎస్సీ 191 (95 జనరల్, 96 మహిళలు), బీసీ 256 (130 జనరల్, 126 మహిళలు), అన్ రిజర్వుడు 490 (246 జనరల్, 244 మహిళలు) ప్రకారం కేటాయించారు.
10,006 మంది వార్డు సభ్యులు:
972 గ్రామ పంచాయతీల్లో 10,006 వార్డులు ఉన్నాయి. వీటిలో తండాలు 158 (79 జనరల్, మహిళలు79), ఎస్టీలు 120 (31 జనరల్, మహిళలు 89), ఎస్సీలు 2001(788 జనరల్, మహిళ 1213), బీసీ 2783 (1371 జనరల్, మహిళలు1412), అన్ రిజర్వుడు 4,944 (2734 జనరల్, మహిళలు 2210) ప్రకారం కేటాయించారు.
మహిళలే అధికం
సర్పంచు స్థానాలకు మహిళలే ఎక్కువగా బరిలో దిగనున్నారు. జిల్లాలో 972 సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 496 సీట్లను మహిళలకు కేటాయించారు.
తొలి విడత
మార్చి 15: షెడ్యూల్
మార్చి 17 నోటిఫికేషన్
మార్చి 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 21: తిరస్కరణకు గురైనవారు డీఆర్వో లేదా కలెక్టర్‌కు ఆధారాల సమర్పణ
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
మార్చి 27: పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రెండో విడత
మార్చి 17: షెడ్యూల్ విడుదల
మార్చి 19 నోటిఫికేషన్
మార్చి 19 నుంచి 21 నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 23: తిరస్కరణకు గురైనవారు డీఆర్వో లేదా కలెక్టర్‌కు ఆధారాల సమర్పణ
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
మార్చి 29: పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
మార్చి 31: ఎన్నికల కోడ్ ముగుస్తుంది.