నిర్లక్ష్యపు పగుళ్లు

ABN , First Publish Date - 2020-09-12T11:08:42+05:30 IST

పట్టణానికి రక్షిత మంచినీటి సరఫరా చేసే బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ ఆనకట్ట పొడవునా నెర్రలిచ్చాయి. సిమెంట్‌ కాంక్రిట్‌ లైనింగ్‌ స్లాబ్‌లు కుంగిపోయాయి. మట్టి వదులు

నిర్లక్ష్యపు పగుళ్లు

ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నెర్రులు

కుంగిపోయిన సీసీ స్లాబ్‌

నాణ్యతను గాలికి వదిలేశారా..?

ఆదోని ప్రజలకు తాగునీటి గండం

నిర్లక్ష్యం.. పొంచివున్న ప్రమాదం..!


ఆదోని, సెప్టెంబరు 11: పట్టణానికి రక్షిత మంచినీటి సరఫరా చేసే బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ ఆనకట్ట పొడవునా నెర్రలిచ్చాయి. సిమెంట్‌ కాంక్రిట్‌ లైనింగ్‌ స్లాబ్‌లు కుంగిపోయాయి. మట్టి వదులుగా మారి సీసీ స్లాబులు విరిగిపోతున్నాయి. నిర్వహణ లోపం, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రూ.48 కోట్లతో నిర్మించిన ఆదోని రక్షిత మంచి నీటి పథకం ఆనకట్ట కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పట్టణవాసులు తాగునీటికి తంటాలు పడుతున్నారు. 


భారీ ఖర్చుతో..

ఆదోని పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రక్షిత మంచినీటి పథకం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 2003-04లో టీడీపీ ప్రభుత్వం రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసింది. తుంగభద్ర దిగువ కాల్వకి అనుసంధానంగా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం బసాపురం వద్ద 250 ఎకరాలు భూమిని సేకరించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పనులను చేపట్టింది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ కాంట్రాక్ట్‌ దక్కించుకుని, రత్నం కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌, ఫిల్టర్‌ బెడ్స్‌, పైపు లైన్స్‌, ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్స్‌ నిర్మాణ పనులను పూర్తి చేసింది. 


కుంగిపోతున్న సీసీ స్లాబులు

శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మంచిన చెరువులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కానీ 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఆదోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ అప్పుడే దెబ్బతింది. ఆనకట్ట పొడవునా నెర్రలిచ్చింది. ఫిల్టర్‌బెడ్స్‌ వైపు ఎటు చూసినా సిమెంట్‌ కాంక్రిట్‌ స్లాబులు కుంగి పగిలిపోతున్నాయి. కట్టకు మూడు వైపులా ఇదే పరిస్థితి.


250 ఎకరాల్లో 3,110 మిలియన్‌ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఎల్లెల్సీ కాల్వ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. పూర్తి స్థాయిలో నీరు చేరితే అలల తాకిడికి ఆనకట్ట నిలబడే పరిస్థితి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా వేసవిలో ఆనకట్ట నిర్వహణ పనులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. 


డిజైన్‌ మార్పు వల్లేనా..?

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు సీసీ లైనింగ్‌తో పోలిస్తే రాతి పరుపు ఎక్కువ భద్రత ఇస్తుందని నిపుణులు అంటున్నారు. ఆదోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో రాతి పరుపు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రతిపాదనల్లో ఉంది. కానీ రాళ్లు దొరకవని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని అప్పటి ఇంజినీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీసీ లైనింగ్‌ చేపట్టారు.


ఇది సరైంది కాదని నిపుణులే అంటున్నారు. రాతి పరుపు ఏర్పాటు చేయడం వల్ల ఒకట్రెండు రాళ్లు జారి పోయినా వెంటనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. సీసీ లైనింగ్‌ కూలిపోతే సరిచేసేందుకు ఎంతో కష్టపడాలి అంటున్నారు నిపుణులు. రాళ్ల మధ్య నుంచి నీళ్లు నల్లమట్టికి తగిలి కట్ట బలంగా ఉండేదని, సీసీ లైనింగ్‌ చేయడం వల్ల నల్లమట్టికి నీళ్లు తగలకపోవడంతో లూజుగా మారి లైనింగ్‌ కూలి పోతోందని ఇంజినీర్లు అంటున్నారు. 


నిర్వహణ లోపం

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి. ఆనకట్ట పొడవునా నెర్రెలు ఇచ్చిన వెంటనే గుర్తించి సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టాలి. సీసీ స్లాబులకు చిన్నపాటి పగుళ్లిచ్చిన వెంటనే గుర్తించి సరి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ మరమ్మతుల కోసం అందులో ఉన్న నీటిని బయటికి వదిలారు.


మరమ్మతులు పూర్తికావాలంటే దాదాపు ఆరు నెలలు సమయం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉన్న పట్టణ జనాభాకు నీటి సమస్య రాకుండా ఏం చేస్తారో తెలియడం లేదు. 


టీడీపీ నాయకుల ఆందోళన

ఎస్‌ఎస్‌ ట్యాంకు దెబ్బతిన్నా అధికారులు నిద్రమత్తు వీడలేదని, గత ఏడాది గుర్తించి మరమ్మతు పనులు చేసి ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌ చౌదరి విమర్శించారు. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ వద్ద టీడీపీ నాయకులు రెండు రోజుల క్రితం ఆందోళన చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరా అందివ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 


మరమ్మతులు చేపడతాం..

బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ సైడ్‌ కాంక్రిట్‌ వాల్స్‌కు ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించేందుకు వచ్చే వారం నిపుణుల కమిటీ వస్తోంది. వారు ఇచ్చే నివేదిక ప్రకారం మరమ్మతు పనులకు  చర్యలు చేపడతాం. భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సకాలంలో పనులు పూర్తి చేసే పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. 

- సురేష్‌, మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ డీఈ, ఆదోని 

Updated Date - 2020-09-12T11:08:42+05:30 IST