మానవ మృగం

ABN , First Publish Date - 2020-03-12T11:26:07+05:30 IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మృగంలా మారాడు. తన వాంఛ తీర్చేందుకు ఒప్పుకోలేదని కన్నతల్లిని కడతేర్చాడు.

మానవ మృగం

 కోరిక తీర్చలేదని తల్లి హత్య

అడ్డొచ్చిన తండ్రిపై హత్యాయత్నం


ఎమ్మిగనూరు/టౌన్‌, మార్చి 11: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మృగంలా మారాడు. తన వాంఛ తీర్చేందుకు ఒప్పుకోలేదని కన్నతల్లిని కడతేర్చాడు. అడ్డొచ్చిన తండ్రిని తీవ్రంగా గాయపరిచాడు. జుగుప్ప కలిగించే ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు, పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చిన్నతనం నుంచే జులాయిగా మారాడు. చదువుకు దూరమై మద్యానికి, జల్సాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లాడు. ఇన్నాళ్లూ కుటుంబ బాధ్యతలు నిర్వహించిన తండ్రి అనారోగ్యంతో ఇంటిపట్టున ఉంటున్నాడు. తాగుడుకు బానిసన కుమారుడు రోజూ తల్లిని వేధించేవాడు. తల్లిదండ్రులు తప్పని చెప్పినా వినేవాడు కాదు. ఈ కారణంగా ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని తల్లిదండ్రులు ఎవ్వరికీ చెప్పలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తాగి వచ్చిన కుమారుడు తల్లిని బలవంతం చేయబోయాడు.


తండ్రి అడ్డురాగా పక్కనే ఉన్న బండరాయితో తండ్రిపై దాడి చేశాడు. అడ్డుకున్న తల్లిని కూడా బండరాయితో బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్పృహతప్పి పడిపోయింది. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. అరపులు కేకలు విన్న చుట్టు పక్కల వారు వచ్చి దంపతులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిపై 324, 354-డీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-03-12T11:26:07+05:30 IST